విల్లివాకం న్యూస్: బహుముఖ ప్రజ్ఞాశాలి మాలతి చందూర్ అని కవి, రచయిత పాణ్యం దత్త శర్మ తెలిపారు. దుర్గాబాయ్ దేశ్ ముఖ్ మహిళా సభ, చెన్నై సాంస్కృతిక విభాగం, దుర్గా స్రవంతి ఆధ్వర్యంలో మాలతీ చందూర్ జయంతిని పురస్కరించుకుని గురువారం జరిగిన కథావాహిని కార్యక్రమం ఆకట్టుకుంది. దీనికి చెన్నై, మైలాపూర్ లజ్ చర్చ్ రోడ్డు, ఆంధ్ర మహిళా సభ హాలు వేదికయింది. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ ఆముక్త మాల్యద స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం ఎస్పీ వసంతలక్ష్మి ప్రార్ధన గీతం ఆలపించారు. కార్యక్రమానికి చెన్నై, రాజధాని కళాశాల, తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు, ఆచార్య ఎల్బి శంకరరావు అధ్యక్షత వహించారు.

మాలతీ చందూర్ తో తన పరిచయం గురించి వివరించారు. ఇందులో వక్తలుగా విశ్రాంత ప్రధానాచార్యులు, కవి, రచయిత పాణ్యం దత్త శర్మ, విశాఖపట్నం కు చెందిన జట్టి యల్లమంద పాల్గొన్నారు. వీరు మాలతి చందూర్ రచనల విశిష్టత తెలిపారు. పాణ్యం దత్తశర్మ మాట్లాడుతూ మాలతి చందూర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని, 24 నవలలు రాశారన్నారు. హృదయనేత్రి నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందన్నారు భారత స్వాతంత్ర పోరాటాన్ని నవలగా మార్చినట్లు తెలిపారు. స్త్రీ అభ్యుదయానికి పాటుపడినట్లు పేర్కొన్నారు. అనంతరం జట్టి యల్లమంద మాలతి చందూర్ సాహితీ విశిష్టతను కొనియాడారు. ఇందులో కార్యక్రమానికి రాలేకపోయిన డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య సందేశాన్ని చదివి వినిపించారు. కార్యక్రమంలో వై రామకృష్ణ, కాసల నాగభూషణం, ప్రభావతి, జయశ్రీ, పత్రి అనురాధ తదితరులు పాల్గొన్నారు.