కోడంబాక్కం న్యూస్: సినీ నటుడు రామ్ చరణ్ తేజ్, ఆయన సతీమణి ఉపాసన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిశారు. ముంబైలోని తన నివాసానికి వచ్చిన రామ్ చరణ్ తేజ్ దంపతులకు సీఎం షిండే సాదర స్వాగతం పలికారు.

తమ ఇంటికి వచ్చిన రామ్ చరణ్ దంపతులకు పుష్పగుచ్ఛంతోపాటు వినాయకుడి విగ్రహాన్ని ఇచ్చి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు షిండే. సినీ రంగంతోపాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయన్నారు. ఈ భేటీలో షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్, ఆయన సతీమణి వృశాలి ఉన్నారు.

కాగా, రామ్ చరణ్ కుటుంబంతో కలిసి ముంబైలోని సుప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారలతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. క్లీంకార పుట్టి ఆరు నెలలైన సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తెకు అమ్మవారి ఆశీస్సుల కోసం ముంబై మహాలక్ష్మి ఆలయానికి తీసుకు వచ్చారు. రామ్ చరణ్ రాకతో ఆలయం వద్ద సందడి నెలకొంది. మీడియా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ.. రామ్ చరణ్ వారికి సున్నితంగా నో చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ్నించి వెళ్లిపోయారు.