విల్లివాకం న్యూస్: చెన్నై నగరంలో మాతృభాష పరిరక్షణ కోసం నిర్విరామంగా పాటుపడుతూ నిరుపేద, బడుగు వర్గాల ప్రజలకు తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, తెలుగు సంఘాలు సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు సహకారాలందిస్తూ ఆదర్శ మహిళగా డాక్టర్ ఏవి శివకుమారి పేరు గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు వాస్తవ్యులు ఆలూరి రామస్వామి, బసవపూర్ణావతి దంపతుల రెండవ కుమార్తె శివకుమారి. ఈమె విద్యాభ్యాసమంతా చెన్నైలోనే సాగింది. బి.ఏ, ఎం.ఏ (తెలుగు) ఎమ్.ఏ (హిందీ), బి.ఈడి, ఎం.ఈడి లు పూర్తి చేశారు. కోడంబాక్కంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూలులో హిందీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. 40 సంవత్సరాలపాటు ప్రభుత్వ సేవలందించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్వాగతం అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా, కోశాధికారిగా, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ గా పదవులు చేపట్టారు. అంతేకాకుండా కూచిపూడి, భరతనాట్యం నృత్యాలు నేర్చుకొని భారతదేశం లోని పలు రాష్ట్రాలు, సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి దేశాలలో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అనేక అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు. అమెరికా తానా సభలో లయన్స్ క్లబ్, వివిధ తెలుగు సంఘాలకు చేసిన సేవలను గుర్తించి అవార్డుతో ఘనంగా సత్కరించారు.
చెన్నై నగరంలో మాతృభాష పరిరక్షణకు కృషి చేస్తున్న పలు తెలుగు సంఘాలలో శివకుమారి సభ్యురాలిగా నేటికీ కొనసాగుతున్నారు. చెన్నై మైలాపూర్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ కమిటీ సభ్యులుగా సుదీర్ఘకాలంగా వ్యవహరిస్తున్నారు. అలాగే, ప్రపంచ తెలుగు సమాఖ్య, అఖిల భారత తెలుగు ఫెడరేషన్, ఆంధ్ర కళా స్రవంతి, చెన్నై తెలుగు అసోసియేషన్ వంటి పలు తెలుగు సంఘాలలో శివకుమారి సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. ఈ సంఘాలు నిర్వహించే అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఓవైపు మాతృభాష పరిరక్షణకు పాటుపడుతూ, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లయన్ డాక్టర్ ఏవి శివకుమారి ఆదర్శ మహిళగా జీవనయానాన్ని కొనసాగిస్తున్నారు.