చెన్నై న్యూస్: ప్రతి ఒక్కరికీ సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ముఖ్యమని రిటైర్డ్ డిజిపి శైలేంద్ర బాబు అన్నారు. క్యాప్సీ తమిళనాడు అండ్ పాండిచ్చేరి ఛాప్టర్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ డే ను గురువారం రాత్రి రేడియల్ రోడ్ పల్లవరం లోని సురభి హాల్ వేదికగా ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ డీజీపీ (రిటైర్డ్ )డాక్టర్ సి. శైలేంద్ర బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రత రంగంలో ప్రవేట్ సెక్యూరిటీ చేస్తున్న సేవలు కొనియాడదగినవని పేర్కొంటూ దీని ద్వారా వేలాదిమందికి జీవనోపాధి కల్పిస్తుండటం హర్షణీయం అని తెలిపారు. ప్రతీ మనిషి బ్రతకడానికి అన్నం, నీరు తరువాత సేఫ్టీ , సెక్యూరిటీ చాలా ముఖ్యమని అన్నారు.

భద్రతకు పెద్ద పీట వేసేలా పోలీసు శాఖలో కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రవేట్ సెక్యూరిటీని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాను పోలీసు శాఖలోకి రాకముందు ఒక సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీగా పని చేశానని గుర్తు చేశారు. సెక్యూరిటీగా ఉంటే సరిపోదని, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ మాట్లాడటం, మనవతాదృక్పదంతో పనిచేసేలా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ముందుగా ఈవెంట్ చైర్మన్ జె ఎస్ కె నాయుడు సెక్యూరిటీ డే గురించి వివరించారు. సభకు క్యాప్సీ సంస్థ అధ్యక్షుడు ఎస్ నెవిల్ ప్రయాన్ అధ్యక్షత వహించగా, కార్యదర్శి
రాజీవ్ కుమార్, కోశాధికారి లియో రాజరాజన్ లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శైలేంద్ర బాబు చేతుల మీదుగా ఉత్తమ సేవలను అందిస్తున్న వివిధ సెక్యూరిటీ సంస్థలకు, ఉద్యోగులకు అవార్డులతో ఘనంగా సత్కరించారు.