2014 సీన్‌ రిపీట్‌
హిట్టా.. ఫట్టా!
* అందరూ ఒకవైపు.. జగన్‌ ఒక్కడే మరోవైపు
* అన్నపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిల
*టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ
*వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు
* కౌంటర్లు, ప్రతికౌంటర్లు
* తమను ఓడిరచలేకే కలిసి వస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్న అధికార పార్టీ
అమరావతి న్యూస్ :
నిన్న, మొన్నటి వరకూ టీడీపీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఆ పార్టీతో బీజేపీ కలవబోదని అంతా భావించారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాన్ని బీజేపీ అగ్రనేతలు అంత త్వరగా మర్చిపోరని అనుకున్నారు. అటువంటివేవీ లేకుండానే టీడీపీ-జనసేన-బీజేపీ కలిసిపోయాయి. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా వచ్చేస్తుంది. వాస్తవానికి ఏపీలో జగన్‌ మద్దతు ఎన్డీయే ప్రభుత్వానికి ఉంది. నేరుగా పొత్తులు లేకపోయినా జగన్‌ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అడుగులు వేస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇంక పొత్తులు ఖరారు కావడంతో ఏపీలో ఎన్డీఏ కూటమిపై వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించేశారు. ఎంతమంది గుంపులుగుంపులుగా వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలో ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలన్నీ తమ ఓటమి భయాన్ని కప్పిపుచ్చునే ప్రయత్నాలేనని, ఈసారి వైసీపీ గెలుపుపై ఆ పార్టీ నేతల్లో కూడా అనేక సందేహాలు ఉన్నాయని టీడీపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నారు. పొత్తులు ఖరారు కావడంతో వైసీపీ వైపు నుంచి ముప్పేట దాడి మొదలవుతోంది. మరోవైపు ఏపీసీసీ చీఫ్‌ షర్మిల కూడా తన అన్న జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ, జనసేనలే కాదు.. షర్మిల, కాంగ్రెస్‌ పార్టీ కూడా చంద్రబాబు గీసిన గీతలోనే నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

వైసీపీది ధైర్యమా.. మేకపోతు గాంభీర్యమా?

రాష్ట్రంలో వైసీపీని ఓడిరచాలన్న లక్ష్యంగా అన్ని పార్టీలూ ఏకమయ్యాయన్నది సుస్పష్టం. వైసీపీతో కలిసే పార్టీనే ప్రస్తుతానికి ఏదీ లేదు. అయితే దమ్ముంటే ఒంటరిగా రండి అని వైసీపీ చాలెంజ్‌ చేస్తున్నారు. ఇలాంటి చాలెంజ్‌ లోనే వారి భయం కనబడుతోందన్న సెటైర్లు టీడీపీ నేతలు వేస్తున్నారు. జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు భయానికి నిదర్శనంగా ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ-జనసేన బలం పుంజుకోవడం, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం వైసీపీ నేతలను కలవరపెడుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల విషయంలో భారీ సంఖ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జాబ్‌ క్యాలెండ్‌ విడుద చేయకపోవడంపై నిరుద్యోగులు, జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, బిల్లుల అంశంపై కాంట్రాక్టర్లు కూడా వైసీపీకి వ్యతిరేకులుగా మారుతున్నారు. వాటన్నింటినీ గమనించే వైసీపీ నేతలు ఈ లేని ధైర్యాన్ని కనబరుస్తున్నారని, వైసీసీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడులు శూన్యంగా ఉన్నాయని, అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయని యువత ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నింటినీ సంక్షేమ పథకాలు కవర్‌ చేస్తాయని.. పేదలంతా తమకే ఓటేస్తారని.. గట్టి నమ్మకంతో వైసీపీ నేతలు ఉన్నారు. వారిది నిజమైన నమ్మకమా.. మేకపోతు గాంభీర్యమా అన్నది వారికే తెలియాలి.

కూటమి గెలుస్తుందా.. ఓడుతుందా?

తెలుగుదేశం, బీజేపీ, జనసేన.. ఈ కూటమి కొత్త కాదు. 2014 ఎన్నికల సమయంలో తొలి సారి ఈ కూటమి ఏర్పడిరది. ఎన్నికలకు నెలల ముందు పార్టీ పెట్టిన పవన్‌ కల్యాణ్‌ .. కాంగ్రెస్‌ హఠావో దేశ్‌ బచావో అంటూ నినదించాడు. అప్పటి వరకూ కమ్యూనిస్టు పలుకులు పలికి, చేగువేరా పోజులు ఇచ్చి పవన్‌ కల్యాణ్‌ ఆ ఎన్నికల సమయంలో అపర కాషాయవాదిగా మారారు. ప్రశ్నించడానికే పార్టీ అన్నారు, తన మద్దతుతో అధికారంలోకి వస్తే టీడీపీని సైతం ప్రశ్నిస్తానంటూ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి మారింది. 2019 నాటికి మాత్రం ఈ మూడు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేశాయి. అందులో ప్రధానంగా పవన్‌ కల్యాణ్‌ వెళ్లి కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం.. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చాలనే వ్యూహమని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే ప్రజలు పవన్‌ ను రెండు చోట్లా ఓడిరచారు. అలాంటి రాజకీయ వ్యూహం ఫలించని నేపథ్యంలో.. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. పవన్‌ ను వేరేగా పోటీ చేయించడం కన్నా తనతో కలుపుకొని పోటీ చేయించడమే మంచిదనే లెక్క చంద్రబాబు వద్ద ఉంది. 2019లో జనసేన పొందిన ఓట్లన్నీ ఇప్పుడు గంపగుత్తగా టీడీపీకి పడతాయని.. ఇది తనను మళ్లీ అందలం ఎక్కిస్తుందనే లెక్కలో చంద్రబాబు ఉన్నారు. ఇప్పటికీ అధికారంపై నమ్మకం రాకపోవడంతో బీజేపీని కూడా పొత్తుకు దించుకున్నారు. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కొంత మేర నష్టం తప్పదు. ఏపీలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును టీడీపీ మరిచిపోవాల్సిందే. బీజేపీతో పొత్తు ఉంటే ఎలక్షన్‌ మేనేజ్‌ మెంట్‌ ఈజీగా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఓడినా.. కేంద్రంలో ఎలాగూ బీజేపీనే పవర్‌ లోకి వస్తుంది కాబట్టి.. కనీసం కేసులు, అరెస్టుల విషయంలో రక్షణ ఉంటుందని చంద్రబాబు అంచనా వేసి ఉండొచ్చు. అధికారం దక్కకపోయినా.. అరెస్టుల భయాలతో చంద్రబాబు ఇప్పుడు కమలం పంచన చేరారని స్పష్టం అవుతోంది.
తమ సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు జనసేన వల్ల కాపుల ఓట్లు, బీజేపీకి ఉన్న ఒకటీ అర శాతం ఓట్లు కలిసి వస్తే.. 2014 తరహాలో తను మళ్లీ సీఎం అయిపోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అప్పట్లానే ఒకటిన్నర శాతం ఓట్లతో బయటపడతామనే లెక్కల్లో ఉన్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసాలున్నాయి. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద మొత్తంగా రాష్ట్రమంతా కలిపి ఐదున్నర లక్షల ఓట్లు అదనంగా పొందింది. అలా ఒకటిన్నర శాతం అదనపు ఓట్లతో చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే అప్పుడు వీచిన మోడీ గాలి చంద్రబాబుకు ఆ ఒకటిన్నర శాతం అదనపు ఓట్లను సంపాదించి పెట్టింది. దేశమంతా కాంగ్రెస్‌ మీద వ్యతిరేకత నిండి ఉంది. దాదాపుగా కాంగ్రెస్‌ పార్టీ నేతలతోనే నిండిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ మేరకు కుదుపులకు లోనైంది! మోదీ వేవ్‌.. పవన్‌ కల్యాణ్‌ ప్రచారం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది. ఒకవేళ ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరి పోరుకు వెళ్లి ఉంటే, ఈ పాటికి టీడీపీ ఏపీ రాజకీయ తెరపై కూడా ఉండేది కాదేమో! ఇప్పుడు పరిస్థితి మారింది. పవన్‌ కల్యాణ్‌కు పార్టీని నడిపేస్థాయి లేదని జనాలకు అర్థమైంది. మోదీ వేవ్‌ కూడా నాటి స్థాయిలో ఇప్పుడు లేదు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు స్వల్పం. వీరి మైత్రిపైనా ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు బీజేపీకి చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు కేటాయించినా టీడీపీ ఆ మేరకు నష్టం కచ్చితంగా జరుగుతుంది. అది పది అసెంబ్లీ సీట్లు అయినా, ఐదు ఎంపీ సీట్లు అయినా.. టీడీపీకి బీజేపీ బలం వల్ల కలిసి రావడం కన్నా.. బీజేపీకి కేటాయించిన సీట్లను తెలుగుదేశం పార్టీ మరిచిపోవాల్సిన పరిస్థితులు తప్పకపోవచ్చు! అలాగే నాటి ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ది ప్రచార పాత్ర. అప్పటికే జనసేన పెట్టినా, తెలుగుదేశం పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌ తరహాలో పవన్‌ కల్యాణ్‌ అప్పుడు పని చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని పవన్‌ అప్పుడు చేసిన ప్రచారం టీడీపీకి ఎన్నో కొన్ని ఓట్లను తెచ్చిపెట్టింది. కాపు ఓటర్లను ప్రభావితం చేసింది. పవన్‌ సినీవీరాభిమాన ఓటు టీడీపీకి పడిరది. ఇప్పుడు జనసేన నేరుగా పోటీ చేస్తోంది. ఆ పార్టీకి ఏకంగా 24 సీట్లను ప్రకటించారు. అయితే, అందులో ఐదు సీట్లలోనూ సరైన అభ్యర్థులను ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది. ఇంక పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందో చూడాలి. 2014లో టీడీపీని గెలిపించిన బీజేపీ, జనసేన ల ఓట్లు కు తోడు చంద్రబాబు ఇచ్చిన హామీలు అప్పుడు కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకూ ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు వ్యవహరించే తీరు ప్రజల్లోకి గట్టిగా వెళ్లింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఏమైనా చెబుతాడని, ఎన్నికలు కాగానే ఆయన తీరు మారిపోతుందనే క్లారిటీ ప్రజలకు ఇప్పుడు పూర్తిగా ఉంది. మరోవైపు జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచే చోట చాలా వరకూ సరైన అభ్యర్థులు లేరు. అసంతృప్తితో రగిలిపోతున్న తమ్ముళ్లు సహకరిస్తారన్న నమ్మకం లేదు. ఈ నియోజకవర్గాల్లో వైసీపీకి అదనపు బలమనే చెప్పాలి. దీనికితోడు 2014లో వైసీపీ ఒక్కసారైనా అధికారంలో లేదు. ఇప్పుడు ఐదేళ్లు అధికారం పొందింది. ప్రభుత్వంపై చాలా వరకూ వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని జగన్‌ కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు. మొత్తంగా 2014 నాటి పరిస్థితి అటు కూటమికి.. ఇటు వైసీపీకి కూడా లేవు.