ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం

విల్లివాకం న్యూస్: అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 123వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి రాయపేట హైరోడ్డు, లజ్, మైలాపూర్, చెన్నై వేదికయింది. ఈ సందర్భంగా వక్తృత్వ, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముందుగా నిడమర్తి వసుంధరాదేవి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. కమిటీ సభ్యులు
డా. ఎం.వి. నారాయణ గుప్తా స్వాగతోపన్యాసం చేశారు. కమిటీ అధ్యక్షులు కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి
అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథిగా ప్రముఖ చలనచిత్ర గేయ రచయిత
భువనచంద్ర విచ్చేశారు.

ఆత్మీయ అతిథిగా టి.నగర్ కేసరి మహోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య పాల్గొన్నారు. ఇందులో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమరజీవి త్యాగం మరువలేనిదని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతవరకు ఆయన త్యాగం నిలిచిపోతుందన్నారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ తెలుగు వారికి ఎనలేని కీర్తి సాధించి పెట్టిన అమరజీవి త్యాగధనులని, భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికారని తెలిపారు. కమిటీ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వందన సమర్పణ ఊరా శశికళ చేశారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు.