టోల్ గేట్లు రద్దు, లీటర్ పెట్రోల్ 75 రూపాయలకే డిఎంకె మేనిఫెస్టో విడుదల?

చెన్నై న్యూస్  :దేశమంతా ఎన్నికలు ఒకలా ఉంటే తమిళనాట మరోలో ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నికల హామీలు మాత్రం విశేషంగా ఆకర్షిస్తుంటాయి.
జయలలిత వర్సెస్ కరుణానిధి ఉన్నప్పుడు పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్ల పంపిణీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుుడు తమిళనాడు అధికార పార్టీ కళ్లు చెదిరే మేనిఫెస్టోను ప్రకటించింది.
దేశంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 102 స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ జరగనుండగా ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చ్ 30 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. ఎన్నికల్లో ఇచ్చే హామీలు, ఓటర్లకు పంచే తాయిలాలతో తమిళనాడు ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఇవాళ అధికార పార్టీ డీఎంకే లోక్‌సభ అభ్యర్ధుల జాబితాతో పాటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది.

తమిళనాడులో డీఎంకే 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన 18 స్థానాలు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే ఇతర పార్టీలకు కేటాయించింది. వీటీలో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. సిట్టింగు ఎంపీలు కనిమొళి, టీఆర్ బాలు, ఎ రాజాలకు మరోసారి టికెట్ దక్కింది.

ఆకర్షిస్తున్న డీఎంకే హామీలు

పెట్రోల్ ధరను 75 రూపాయలకు, డీజిల్ ధరను 65 రూపాయలకు తగ్గిస్తామని హామీ ఇచ్చి డీఎంకే అందర్నీ ఆశ్చర్యపర్చింది. అంతేకాకుండా జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్లను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చింది. దేశంలో ప్రతి మహిళకు నెలకు 1000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. గవర్నర్లకు చట్టపరమైన మినహాయింపులిచ్చే ఆర్టికల్ 361 రద్దు చేస్తామని స్పష్టం చేసింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాను తొలగించే అధికారాన్ని కేంద్రానికి కల్పించే ఆర్టికల్ 356 రద్దుకు పోరాడతామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది.

రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చింది. జాతీయ విద్యా విధానం, నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టాల్ని తమిళనాడులో అమలు చేయమని డీఎంకే మేనిఫెస్టోలో వెల్లడించింది.
………………….