ఆచార్య దార్ల సేవలు శ్లాఘనీయం

హైదరాబాద్ న్యూస్ :గత మూడేళ్ల కాలంలో తెలుగు శాఖ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శాఖాధ్యక్షులుగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేసిన సేవలు ప్రసంశనీయమని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. హెచ్ సి యు తెలుగు శాఖ అధ్యక్షులుగా శుక్రవారంతో తన పదవీకాలం పూర్తయిన సందర్భంగా అధ్యాపకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఒక వైపు శాఖాధ్యక్షులుగా తన విధులను నిర్వర్తిస్తూనే, మరొకవైపు పాఠాలు చెప్తూ, పరిశోధన చేయిస్తూ, వ్యక్తిగతంగా తాను రచనా వ్యాసంగాన్ని, సాహిత్య కార్యక్రమాల్ని కొనసాగించిన కార్యదక్షులుగా ఆచార్య దార్ల ను సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య గోనానాయక్ వ్యాఖ్యానించారు.

తెలుగు శాఖతో తనకు మూడు శతాబ్దాల పాటు అనుబంధం ఉందనీ, ఆచార్యులు కొత్తపల్లి వీరభద్రరావు, జి.వి.సుబ్రహ్మణ్యం, ముదిగొండ వీరభద్రయ్య, బేతవోలు రామబ్రహ్మం వంటి గొప్పవాళ్ళు శాఖాధ్యక్షులుగా పనిచేసిన వరుసలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పని చేసి, చక్కని సమర్థుడని పేరుతెచ్చుకున్నారని సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవీయ శాస్త్రాల విభాగం పీఠాధిపతి ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు వ్యాఖ్యానించారు.
కరోనా సమయంలో శాఖాధ్యక్షులుగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన కాలంలో ఐదుగురు నూతన అధ్యాపకుల నియామకం జరిగింది. ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ తరగతులు జరుపుకొనే సంధికాలంలో అధ్యక్షులుగా ఆచార్య దార్ల చక్కని సమన్వయంతో పనిచేశారని అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య దార్లను ఘనంగా సత్కరించారు.

శనివారం నుండి నూతన శాఖాధ్యక్షులుగా కొనసాగబోయే ఆచార్య పిల్లలమర్రి రాములుకి ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు శాఖాధ్యక్షుల నియామక పత్రాన్ని అందించారు. తన విధులనేవి ఉద్యోగంలో భాగమేననీ, ఆ పదవిలో ఉన్న వారెవరైనా అందరి సహకారం వల్లనే శాఖను అభివృద్ధిపథంలో నడిపించడం సాధ్యమౌతుందని, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య డి.విజయలక్ష్మి, ఆచార్య వంగరి త్రివేణి, డా.బి.తిరుపతి, డా.బి.భుజంగరెడ్డి, డా.పి.విజయ్ కుమార్, డా.బి.లత, స్వాతి, దయాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.
……………………………