నటి కళ్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్య కిరణ్‌ కన్నుమూత..

కోడంబాకం న్యూస్ :ఒకప్పటి హీరోయిన్‌ కళ్యాణి మాజీ భర్త, దర్శకుడు,నటుడు సూర్య కిరణ్‌ కన్నుమూశారు. సోమవారం ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన కళ్లకి పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు.
అది మరింతగా పెరగడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. సూర్య కిరణ్‌ మృతిపట్ల తెలుగుతోపాటు సౌత్‌ ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సూర్య కిరణ్‌.. తెలుగులో `సత్యం`, `ధన 51`, `బ్రహ్మాస్త్రం`, `రాజుభాయ్‌` వంటి చిత్రాలను రూపొందించారు.

కేరళాకి చెందిన సూర్య కిరణ్‌ మలయాళ సినిమాలతో కెరీర్‌ని ప్రారంభించారు. ఆయన మలయాళ సినిమాల్లో నటుడిగా మెప్పించారు. 1978లో `స్నేహిక్కన్‌ ఓరు పెన్ను` చిత్రంలో నటించారు. ఈ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళంతోపాటు కన్నడ, అట్నుంచి తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులోకి 1986లో చిరంజీవి హీరోగా నటించిన `రాక్షసుడు` మూవీతో ఎంట్రీ ఇచ్చాడు.

ఇలా తెలుగులో `దొంగమొగుడు`, `సంకీర్తన`, `ఖైదీ నెం 786`, `కొండవీటి దొంగ` చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. చిరంజీవితోపాటు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ వంటి బిగ్‌ స్టార్స్ తో సినిమాలు చేశారు. నటుడిగా మెప్పించారు.
సూర్య కిరణ్‌.. 2003లో `సత్యం` సినిమాతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. సుమంత్‌ హీరోగా నటించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది. నాగార్జున నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో నటనకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి దర్శకుడిగా కొనసాగారు. ఆ తర్వాత సుమంత్‌తోనే `ధన 51` చిత్రం చేసి మెప్పించారు. జగపతిబాబుతో `బ్రహ్మాస్త్రం` సినిమా చేశారు. మంచు మనోజ్‌ తో `రాజు భాయ్` అలాగే చివరగా `ఛాప్టర్ 6` అనే సినిమాలకు దర్శకత్వం వహించారు.

కానీ ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ సమయంలోనే హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. ఇక సూర్య కిరణ్‌ తెలుగు బిగ్‌ బాస్‌ షోలో పాల్గొన్నారు. బిగ్‌ బాస్‌ 4వ సీజన్లో కంటెస్టెంట్‌గా సందడి చేశారు. కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్‌ అయ్యారు.