ఆదిభట్ల నారాయణదాసు సాహిత్యం సమాజానికి చైతన్యం

విల్లివాకం న్యూస్: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు సాహిత్యం సమాజానికి చైతన్యం కలిగిస్తుందని గుంటూరులోగల విశ్వనాథ సాహిత్య ఆకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ తెలిపారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ‘తరతరాల తెలుగు కవిత’ ఉపన్యాస ధారావాహిక 147వ కార్యక్రమం టినగర్ ఆంధ్రా క్లబ్ కృష్ణా హాలు వేదికగా ఆదివారం సాయంత్రం జరిగింది. ఇందులో వక్త మోదుగుల రవికృష్ణను వేద విజ్ఞాన వేదిక అధ్యక్షుడు జెకె రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు శాలువతో సత్కరించారు. అనంతరం ‘అది భట్ల నారాయణదాసు వ్యక్తిత్వం – సాహిత్యం’ అనే అంశంపై వక్త ప్రసంగిస్తూ తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆదిభట్ల హరికథ, సాహిత్య రంగంలో రాణించారని కొనియాడారు. ఆ రంగాలకు ఆయన చేసిన కృషిని తనదైన శైలిలో ఆయన వివరించారు. పామరుల నుంచి పండితుల దాకా వారి హృదయాలను హత్తుకునేలా ఆదిభట్ల కలం నుంచి జాలువారిన సాహిత్యాలన్నీ ఆణిముత్యాలేనని అన్నారు. చెన్నై నగరంలో తెలుగువారి మధ్య మహా పండితుడైన ఆదిభట్ల నారాయణదాసు వ్యక్తిత్వం, సాహిత్యం గురించి ప్రసంగించే అవకాశం రావటం ఆనందంగా ఉందని, వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత కార్యక్రమం వందేళ్లపాటు ఇలాగే కొనసాగాలని మోదుగుల రవికృష్ణ ఆకాంక్షించారు.
………………………..