దక్షిణాదిపై గురి!
* ఈ నెల 15 నుంచి ప్రధాని పర్యటన
*ఎన్నికల సభలు
* ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ప్రచారం
అమరావతి న్యూస్‌ : లోక్‌ సభ ఎన్నికల్లో 410కి పైగా సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్డీయే కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతోపాటు వాళ్ల సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఒక్క కర్ణాటక మినహా కమల దళానికి మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేదు. ఆ లోటును పూడ్చుకోడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఈనెల 15 నుంచి 19 వరకు ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంపై ఆయన ఎక్కువ దృష్టి సారించారు. ఈ నెల 16, 18, 19 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మూడుచోట్ల పార్టీ పరంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అధికారిక కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికే సమయం కేటాయిస్తున్నారు. మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, మల్కాజిగిరిలలో సభల నిర్వహణకు రాష్ట్ర పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఒక్కో చోట నిర్వహించే బహిరంగసభలో రెండు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలు కవర్‌ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల సభలో నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలు, నాగర్‌కర్నూల్‌ బహిరంగసభలో నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మల్కాజిగిరి సభలో భువనగిరి, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గాలు కవరయ్యేలా కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

17న చిలుకలూరిపేట సభకు మోదీ

ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఇందుకు టీడీపీ, బీజేపీ, జనసేన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రానున్నారు. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మూడు పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లపై నారా లోకేశ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమీక్షకు కమిటీ సభ్యులు హాజరయ్యారు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో తన ఇమేజ్‌తో సొంతంగా కొన్ని సీట్లు అయినా సాధించేలా మోదీ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.