అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటిఎఫ్) తరఫున ఘన నివాళులర్పించారు. చెన్నై మైలాపూర్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలోనున్న ఆయన విగ్రహానికి ఏఐటిఎఫ్ అధ్యక్షులు ప్రొఫెసర్ సిఎంకే రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇందులో ఏఐటిఎఫ్, వైస్ ప్రెసిడెంట్, టామ్స్, ఫౌండర్ గొల్లపల్లి ఇశ్రాయేలు, టామ్స్ ప్రెసిడెంట్ విజయకుమార్, ట్రిప్లికేన్ వింగ్ దీనదయాళ్ (దీన), పి.సతీష్ కుమార్, అరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకే రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు మాతృభాషలో పరీక్షలు రాసేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల తాను సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమిళనాడు ఎడ్యుకేషన్ సెక్రటరీతో సచివాలయంలో సమావేశమయ్యానని, ఇందులో తాము చేసిన అభ్యర్థనలపై కార్యదర్శి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో సుప్రీం కోర్టు తీర్పును నిజమైన స్ఫూర్తితో అమలు చేయడం, తమిళం, తమిళేతర విద్యార్థులకు అకడమిక్ లోడ్ (మొత్తం మార్కులు) సమానంగా చేయడం వంటివి ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న స్కీమ్ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.