సర్ పిట్టి త్యాగరాయ చెట్టికి ఏఐటిఎఫ్ నివాళులు

*రిప్పన్ భవనానికి ‘సర్ పిట్టి త్యాగరాయ శెట్టి కాంప్లెక్స్’ గా పేరు పెట్టాలని డిమాండ్

విల్లివాకం న్యూస్: సర్ పిట్టి త్యాగరాయ చెట్టి 173 వ జయంతి సందర్భంగా అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటిఎఫ్) ఆదివారం ఘనంగా నివాళులర్పించింది. తెలుగు దేవాంగ సమాజానికి చెందిన ఆయన న్యాయవాదిగా రాజకీయవేత్తగా సంఘ సంస్కర్తగా రాణించారు. అలాగే, జస్టిస్ పార్టీని స్థాపించి 1919లో ఎన్నికలలో గెలిచారు, కానీ ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించారు. దానిని కడలూర్‌కు చెందిన సుబ్బరాయ రెడ్డియార్‌కు అందజేశారు. అలాగే, మద్రాసు మొదటి మేయర్‌గా పనిచేశారు. (1919-23). అంతేకాకుండా, చెన్నై పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక-అధ్యక్షులుగా సేవలందించారు. విమానాశ్రయంలో బ్రిటీష్ ప్రముఖులను స్వాగతిస్తున్నప్పుడు ఆయన అధికారిక దుస్తులు ధరించడానికి నిరాకరించారు. దీంతో ఆయనకు ‘వెల్లాడై వెందర్’ అనే బిరుదు వచ్చింది. ఉత్తర మద్రాస్‌లో హైస్కూల్, కాలేజీ కోసం భూమిని విరాళంగా అందజేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా చెన్నైలోని త్యాగరాయ నగర్ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. రిప్పన్ బిల్డింగ్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, అయితే ఆ భవనానికి ‘సర్ పిట్టి త్యాగరాయ కాంప్లెక్స్’గా పేరు మార్చాలని తాము తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఏఐటిఎఫ్ అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎంకే రెడ్డి తెలిపారు.

ఇందులో సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్ నందగోపాల్, ఉపాధ్యక్షులు డాక్టర్ సీఎం కిషోర్ పాల్గొన్నారు.
……………………..