టి.టి.డి అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించాలి.
– కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

విల్లివాకం న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మోసాలకు నెలవుగా మారిపోయిందని, తిరుమలలో జరుగుతున్న అన్యాయాలను నిలదీసే హక్కు భక్తులకు లేకుండాపోయిందని గతంలో వున్న యాజమాన్యం ఈ.ఓ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రకాల అవినీతి, అక్రమాలపై ప్రభుత్వము వెంటనే సిబిసిఐడి విచారణ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయవిచారణ జరిపించాలని
తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం విజయవాడ, ప్రెస్ క్లబ్ నందు పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటయింది. ఈ సమావేశంలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమలలో విలేకర్లతో మాట్లాడుతూ తాను వెంకటేశ్వరస్వామి భక్తుడనని నా ప్రాణాలు కాపాడిన వెంకన్న పేరుతో గతంలో జరిగిన మోసాలను అన్నింటిపై చర్యలు తీసుకుంటానని తెలపడం జరిగిందని, ఇది చాలా సంతోషదాయకమైన విషయమని అన్నారు. తిరుమలలో మధ్యం, సిగరెట్లు, గంజాయి లాంటి పదార్థాలు ప్రస్తుతం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, అదే విధంగా టి.టి.డి విజిలెన్స్ అధికారులు అక్రమ ఆర్జనలకు కొమ్ముకాసి కొండపైన చిరు వ్యాపారులకు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ అవినీతికి నిలయంగా తిరుమలను తయారు చేశారని టి.టి.డి ఎన్నో కుంభకోణాలకు, మోసాలకు నిలువుదోపిడీలకు అడ్డాగా మారిపోయిందని, దర్శనాలు కొన్ని ఆన్లైన్లో విక్రయించడం జరుగుతుందని తెలిపినప్పటికీ అదంతా అవినీతి మార్గములో క్యాష్ లైన్లోనే జరిగాయని, పాలక మండలికి వున్న దర్శనాల కోట టిక్కెట్లను బ్లాక్ మార్కెట్లో కొంతమంది దళారులు విచ్చలవిడిగా విక్రయించడం జరిగిందని, ఈ ఆర్జిత సేవ టిక్కెట్లను చెన్నై, ముంబయ్, బెంగుళూర్ లాంటి నగరాలకు చెందిన దళారులు టి.టి.డి అధికారుల అండదండలతో ఎక్కువ మొత్తానికి విక్రయించడం జరిగిందని తెలిపారు. దీనిపైన గతంలో ఏ ఏ ఆర్జిత సేవ దర్శనం టిక్కెట్లు ఎవరెవరు పాలక మండలి సభ్యులు పేర్లతో వాడుకోవడం జరిగిందో విచారణ జరిపించాలని, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిపై సిబిసిఐడి అధికారులను వెంటనే రంగంలోకి దింపి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించాలని, టిటిడిలో గతంలో జరిగిన “రివర్స్ టెండరింగ్” పేరుతో టీటీడీ లో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని, తిరుపతిలోని డిఆర్ మహల్ వద్ద గల గోవిందరాజ సత్రాలను ఆగమేఘాల మీద కూల్చివేసి పునర్నిర్మాణం కోసం 600 కోట్ల రూపాయలను ఒక్కసారిగా కమిషన్ల కోసం కేటాయించడం దుర్మార్గమన్నారు, టీటీడీలో గత ఐదు సంవత్సరాలుగా ధర్మకర్తల మండలి లో ఇంజనీరింగ్ పనుల కోసం ఎన్ని కోట్లు నిధులు మంజూరు చేశారు? ఎంత ఎక్సెస్ పర్సంటేజ్ కి టెండర్లు ఆమోదించి కమిషన్లు దండుకున్నారో నిగ్గు తేల్చాలని, టిటిడి ఇంజనీరింగ్ కు గతంలో ప్రతి ఏటా రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఇటీవల ఉన్నఫలంగా ఏకంగా రూ.1,500 కోట్లను టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎవరి అనుమతితో ఆమోదముద్ర వేశారో ఈ ప్రభుత్వం విచారణ జరపాలని, స్విమ్స్ హాస్పిటల్ లో రెనోవేషన్ (RENOVATION), మెయింటెనెన్స్ పేరుతో సుమారు 200 కోట్ల రూపాయలను కేటాయించిన పనులపై దృష్టి సారిస్తే నమ్మలేని నిజాలు భారీ అవినీతి కుంభకోణం వెలుగులోకి వస్తాయని, తిరుమల కొండపైన అతి పురాతనమైన పార్వేటి మండపాన్ని ఎవరి అనుమతితో కూల్చారని అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని భారతదేశంలో పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, స్టేట్ ఆర్కియాలజీ శాఖలు పనిచేయిస్తున్నాయా? లేదా? అన్న సందేహాన్ని నివృత్తి చేయాలని సామాన్య భక్తులకు గతంలో లాగా క్యూ లైన్లలో అన్న ప్రసాదాలు, మంచినీరు సప్లై వంటివి ఇవ్వలేదని, ధర్మకర్తల సమావేశాలలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై చేసిన తీర్మానాలపై ముఖ్యమంత్రి శ్రీవారి భక్తునిగా సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు, అవినీతి అక్రమాలు వెలుగులోనికి వస్తాయని అందుకు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సిబిసిఐడి దర్యాప్తు లేదా న్యాయ విచారణకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చేవూరి శ్రీధర్రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలను నిగ్గు తేల్చుటకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
బి.సి. సంఘం (చేనేత) నాయకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వము చేనేత కులానికి చెందిన వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మావతి అమ్మవారు కాబట్టి చేనేత కులానికి చెందిన ఒకరిని ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమించాలని ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకున్న పాపానపోలేదని తన ఆవేదనను తెలిపారు.
……………………