బాబుతో పొత్తు.. బీజేపీకి లేదు తొందర!
` పొత్తులపై ఎటూ తేల్చని వైనం
` సంకట స్థితిలో టీడీపీ అధినేత
అమరావతి న్యూస్:
ఏపీ రాజకీయాలపై బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడం లేదు. ఇక్కడ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి పెద్దగా కలిసొచ్చిన లాభం గానీ, నష్టంగానీ ఏమీ లేదు. చంద్రబాబును డిల్లీ పిలిపించుకుంది, ఆ వెంటనే పవన్‌ ను డిల్లీకి పిలిచారనే వార్తలు వచ్చాయి, అదేమీ జరగలేదు. ఇప్పుడు పవన్‌ ను మళ్లీ పిలిచారట! ఇంతలోనే అపాయింట్‌ మెంట్లేవీ ఖరారు కాలేదనే వార్తలూ వస్తున్నాయి. మరి పవన్‌ కు ఎప్పటికి బీజేపీ నేతల దర్శనం దొరుకుతుందో, ఆ తర్వాత మళ్లీ చంద్రబాబును ఎప్పుడు పిలుస్తారో, మళ్లీ పవన్‌ ను ఎప్పుడు రమ్మంటారో .. ఇదంతా ఇప్పుడప్పుడే తేలేలా కనిపించట్లేదు. వాస్తవానికి ఏపీతో బీజేపీకి రాజకీయంగా వచ్చేదీ పోయేది ఏమీ లేదు! కమలం పార్టీకి ఉత్తరాదిపై ధీమా ఉంది. ఆధిపత్యం నిలుపుకోవాల్సిన రాష్ట్రాలూ కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మహారాష్ట్ర. ముంబైపై పట్టు పోగొట్టుకోకూడదని కమలం పార్టీ రాజకీయంగా ఎంతకైనా తెగిస్తోంది. శివసేనను చీల్చింది, ఎన్సీపీ చీల్చింది, కాంగ్రెస్‌ నుంచి నేతలను తీసుకుంటోంది. మహారాష్ట్రలో మెజారిటీ ఎంపీ సీట్లు నెగ్గాలి. ఆ తర్వాత వెంటనే జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గాలి. అలాంటి రాష్ట్రాల విషయంలో జరిగినంత కసరత్తు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ దాని విషయంలో కూడా తీసుకోవడం లేదు. చివరికి కర్ణాటక విషయంలోనూ బీజేపీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జేడీఎస్‌ తో పొత్తు విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్లడం లేదు. సీట్ల బేరం ఏమీ తేల్చలేదు! అలాంటిది ఇక్కడ ఏపీలో అంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందని అనుకోలేం. అందులోనూ వైసీపీ మద్దతుగా ఎలానూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పొత్తు కోసం వెళ్లి, చంద్రబాబుకు మద్దతిచ్చే అవకాశాలు అంతగా ఉంటాయని ఆశించలేం. నామినేషన్లు వేసే సమయానికైనా ఈ పొత్తు బేరం తేలుతుందో, లేదో చూడాలి.