హెచ్ సియు తెలుగు శాఖను సందర్శించిన సిఐఐఎల్ బృందం

హైదరాబాద్ న్యూస్ :మైసూర్ లో ఉన్న భారతీయ భాషా సంస్థలో శిక్షణ పొందుతున్న కొంతమంది పరిశోధకులు అధ్యాపకులు సోమవారం నాడు (25.3.2024) హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖను, సందర్శించారు. దీంతోపాటు ఇక్కడే ఉన్న అంతరిస్తున్న భాషలు మరియు మాతృభాషల అధ్యయన సంస్థ (సి ఇ ఎల్ & ఎం టి ఎస్) శాఖను కూడా సందర్శించారు.
ఆరుగురు సభ్యులు గల ఈ బృందానికి డాక్టర్ మిరియాల సత్యనారాయణ నాయకత్వం వహించారు. వీరిని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సి ఇ ఎల్ & ఎం టి ఎస్ శాఖ అధ్యక్షులు పమ్మి పవన్ కుమార్ నీ, తెలుగు శాఖలో ఉన్న ఇతర అధ్యాపకులు ఆచార్యులు ఎం. గోనా నాయక్, పి.వారిజారాణి, వంగరి త్రివేణి,‌ డా.బాణాల భుజంగరెడ్డి, డా.పి.విజయ్ కుమార్, డా. భాశెట్టి లత తదితరులను కలిశారు‌ ఈ బృందంలో ఏ.ప్రేమ, సంతోష్, కవిత, దక్షిణామూర్తి, సి.బసవరాజు, కుముద తదితరులు ఉన్నారు.
భారతీయ భాషా సంస్థ (సిఐఐఎల్) భారతప్రభుత్వానికి, పార్లమెంటుకు భాషాసంబంధమైన విషయాలలో ప్రధాన సలహాదారు సిఐఐఎల్ , భారతీయ భాషలకు సంబంధించిన పరిశోధన, పరరక్షణ వంటివెన్నో ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఈ బృందానికి నాయకత్వం వహించిన డా.మిరియాల సత్యనారాయణ వివరించారు. సిఐఐఎల్ లోని ప్రాంతీయ భాషా కేంద్రాలు( ఆర్ ఎల్ సి)భారతీయ భాషలను బోధించడంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నాయని డా.మిరియాల పేర్కొన్నారు. దక్షిణ ప్రాంతీయ భాషా కేంద్రం, మైసూరు త్రిభాషా సూత్రం ఆధారంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులకు పరిశోధకులకు దక్షిణ భారతీయ భాషలను బోధిస్తోంది. పదినెలల కోర్సులో భాగంగా తెలుగు, మలయాళు కన్నడ, తమిళం కోర్సులను నేర్చుకునేందుకు మైసూరులో ప్రత్యకమైన శిక్షణనివ్వడం జరుగుతుందని డా.మిరియాల చెప్పారు . శిక్షణలో భాగంగా ఈ విద్యాసంవత్సరంలో (2023-24) తెలుగు భాషను నేర్చుకుంటున్న తెలుగు టీచర్లు రెండు తెలుగు రాష్ట్రాలలో భాషా వైవిద్యాన్ని తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాలలో పర్యటన చేయడం లక్ష్యంగా పెట్టుకొని, ఈ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ని ఎంపిక చేసుకున్నామని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతిక, చారిత్రిక, మత, సామాజిక, ఆర్థికాంశాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు 14 రోజుల ఈ ఎడ్యుకేషన్ టూర్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు. దీనిలో భాగంగానే, తెలుగు భాషా సాహిత్య బోధనల్లో అత్యుత్తమ స్థాయిలో ఉన్న సంస్థలలో హెచ్ సియు, తెలుగు శాఖ ఒకటి కావడం వల్ల ఈ విశ్వవిద్యాలయాన్ని తమ బృందం సందర్శించామని, వివిధ కార్యక్రమాలను ఈ విశ్వవిద్యాలయంతో కలిసి చేయడానికి ఒక (యం ఓ యు) చేసుకోవాలని భావిస్తున్నామని ఈ బృందానికి నాయకత్వం వహించిన డా.మిరియాల సత్యనారాయణ చెప్పారు. పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్ష మంచిదేనని అయితే అటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక విధానం ఉంటుందని, దాని ద్వారా చేయాలని, సంబంధిత ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తారని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. ఇటువంటి సందర్శనవల్ల భాషల స్థితిగతులు అవగాహన చేసుకోవచ్చని అంతరిస్తున్న భాషలు మరియు మాతృభాషల అధ్యయన సంస్థ (సి ఇ ఎల్ & ఎం టి ఎస్) అధ్యక్షులు ఆచార్య పమ్మి పవన్ కుమార్ చెప్పారు. తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడారు. తెలుగు నేర్చుకోవడంలో ఉన్న కొన్ని మెళుకువలను అధ్యాపకులు వివరించారు.
…………………