బ్రాహ్మణపల్లి ప్రతాప్ మృతి
… పలువురి సంతాపం

విల్లివాకం న్యూస్: శ్రీ చెన్నపురి దేవాంగ సంఘం కోశాధికారి బ్రాహ్మణపల్లి ప్రతాప్ సోమవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల సంఘంతోపాటు పలువురు తెలుగు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రాహ్మణపల్లి ప్రతాప్ కీ.శే. టి.కె. బాలయ్య రెడ్డి, కాంతము దంపతులకు 15 డిసెంబర్, 1948 సంవత్సరమున పాత చాకలిపేట, చెన్నైలో జన్మించారు. విద్యాభ్యాసము ఇక్కడే పూర్తిచేసుకొని, చెన్నై మెట్రో వాటర్ బోర్డు నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందారు. శ్రీ చెన్నపురి దేవాంగ సంఘమునకు గత 28 ఏండ్లుగా (1992 నుండి 2000 మరియు 2006 నుండి 06.052024 వరకు) కార్యనిర్వాహక సభ్యులుగాను మరియు కోశాధికారిగాను అకుంఠిత సేవలందించారు. వీరు దేవాంగ సంఘ కన్నికల గుడియందు 2007వ సం॥న నిర్మింపబడిన ప్రార్థనా మందిరమునకు మరియు 2019న సం॥న నిర్మించబడిన సముదాయ మందిరము నిర్మాణ కార్యక్రమమునకు సేవలందిచారు. శ్రీ కపిల వినాయక దేవస్థానమునందు 2013 మరియు 2022 సం॥న జరిగిన మహాకుంభాభిషేకములకును మరియు దేవాంగ సంఘ కన్నికల గుడి యందు 2014 సం॥న నిర్వహించబడిన, కుంభాభిషేకమునకు ముఖ్యపాత్ర వహించారు.
దేవాంగ విధ్యాభివృద్ధి నిధికి విరాళములందించి విద్యార్థుల పై చదువులకు సహాయపడ్డారు. అంతేకాకుండా శ్రీ చెన్నపురి దేవాంగ సంఘము నిర్వహించు కార్య క్రమములకు సేవలందించడమేగాక విరాళములు కూడా అందించి సహాయపడ్డారు. దేవాంగ పెండ్లి సమాజము స్థాపితము మొదలు ఉచిత వివాహములు నిర్వహించుటకు మరియు దేవాంగ పెండ్లి సమాజము చేపట్టిన ఇతర కార్యక్రమములకు సేవలందించారు. మరియు మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజము నిర్వహించిన సాంఘిక కార్యక్రమములందు పాల్గొని సేవలందించారు. వారి మరణము శ్రీ చెన్నపురి దేవాంగ సంఘమునకు, దేవాంగ పెండ్లి సమాజమునకు మరియు దేవాంగ కులస్తులకు తీరని లోటు. వీరికి శ్రీ చెన్నపురి దేవాంగ సంఘము మరియు దేవాంగ పెండ్లి సమాజము తరపున ఘనమైన నివాళులను అర్పిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకు సంతాపము తెలియజేస్తూ వారి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్దించుచున్నాము.

ఇట్లు,
శ్రీ చెన్నపురి దేవాంగ సంఘము మరియు దేవాంగ పెండ్లి సమాజము
…….
మంచి మిత్రున్ని కోల్పోయా!
– గుడిమెట్ల చెన్నయ్య

మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం వ్యవస్థాపకులు పేరిసెట్ల భాస్కరుడు, ప్రతాప్ కలిసి ఉత్తర చెన్నై, పాత చాకలిపేటలోని తెలుగు ప్రజల మధ్య తెలుగు భాషను పెంపొందించే ప్రయత్నం చేశారు. అనేక కార్యక్రమాలు కలిసికట్టుగా చేశారు. కన్నికలమ్మ గుడి, త్యాగరాజ కళాశాల ప్రాంతంలోనూ కార్యక్రమాలు నిర్వహించేవారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమాలు అనేకం ఈ ప్రాంతంలో జరిపించేవారు. స్నేహశీలి, దయాగుణం, కార్యదీక్ష, దక్షత ఉన్న వ్యక్తి. మితభాషి. అటువంటి తెలుగు భాషాభిమాని, సేవాభిలాషి ఉత్తర చెన్నై లోనే కాకుండా పాత చాకలిపేట తెలుగు ప్రజలకు తీరని లోటు.