అంతా ఓవైపు..
ఒక్కడే ఒకవైపు!

*జగన్‌ ఓటమే లక్ష్యంగా పావులు
* ఏకమవుతున్న ప్రతిపక్షాలు
*సహకరిస్తున్న మీడియా, కీలక సామాజిక వర్గాలు

అమరావతి న్యూస్‌ : ఏపీలో రానున్న రెండు నెలల్లో భీకర యుద్ధమే చూడొచ్చు. ఎన్నికల సమయంలో ఒక్కడి ఓటమికి మొత్తం వైరి వర్గాలన్నీ ఏకమవుతున్నాయి. బహుశా 2024 ఎన్నికల లాంటివి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రం చూసి ఉండకపోవచ్చు. అప్పట్లో 1977 ప్రాంతంలో దేశంలోని రాజకీయ పక్షాలు మొత్తం ఒక్క తాటి మీదకు వచ్చి.. ఇందిరను ఓడిరచాలని కంకణం కట్టుకున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు, బలమైన మీడియా, మేధావులు అంతా ఒకవైపు నిలిచి ఉంటే.. మరోవైపు ఇందిరాగాంధీనే. అప్పట్లో ఇందిర ఓడిపోయారు. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం గద్దె ఎక్కింది. కానీ కొద్దిరోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. జగన్‌ పాలన పరంగా ఎలా ఉన్నా… అతనిని గద్దె దించడమే లక్ష్యంగా ఎన్నో శక్తులు ఏకమవుతున్నాయి. బలమైన మీడియా తెర వెనుక ఉండగా.. సమర్ధవంతమైన సామాజిక వర్గం ముందు నిల్చొంది. వాటికి కొన్ని వర్గాలు ఎలానూ కలిసే ఉన్నాయి. బీజేపీ నిర్ణయం కోసం వామపక్షాలు ఎదురుచూస్తున్నాయి. బీజేపీ ఎటువైపు మొగ్గు చూపితే.. దానికి వ్యతిరేకంగా వామపక్షాలు గళమెత్తుతాయి. మొత్తంగా చూసుకుంటే.. ఇటువైపు జగన్‌ ఒక్కరే ఉన్నారు. మరి ఆయన గెలుస్తారా? లేదంటే ఓడిపోతారా? అన్నది పెద్ద ప్రశ్న. ఈ యుద్ధంలో జగన్‌ గానీ గెలిస్తే.. తమ పరిస్థితి ఏమిటో చంద్రబాబు అండ్‌ కోకు తెలుసు. ఓ వర్గం మీడియాకూ తెలుసు. ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాల బాట పట్టవచ్చు. ఒకవేళ జగన్‌ ఓడిపోతే మాత్రం.. అయిదేళ్లపాటు ఇబ్బందులు పడతాడు. మళ్లీ న్యాయపోరాటాలు చేస్తాడు.