“ఘనంగా క్రోధి నామ సంవత్సరం “ఉగాది” కవి సమ్మేళనం”

నెల్లూరు న్యూస్ :శతాధిక జాతీయ కవి సమ్మేళనం “ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం”లో ఉగాది క్రోధి నామ సంవత్సరం సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సమ్మేళనంలో కవులు, కళాకారులు, ఔత్సాహిక సాహితీ వేత్తలు విశేషంగా పాల్గొని విజయవంతం చేశారు. “ప్రపంచ మొక పద్మవ్యూహం కవిత్వం ఒక తీరనదాహాం” అన్నట్లుగా కవులు ఎన్నో ఎన్నెన్నో భావాల్ని తమ కవితలు, పాటలు, పద్యాల ద్వారా వినిపించడం చాలా గొప్పదని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభంలో ఆచార్య మాడభూషి సంపత్ సంపాదకత్వంలో ఇటీవలే వెలువడిన ‘ప్రభూత’, ‘ప్రచురత’ గ్రంథాల్ని సుప్రసిద్ధ సాహితీవేత్త గంగిశెట్టి శివకుమార్, శ్రీ చిన్ని నారాయణ రావు గార్లు ఆవిష్కరించగా, ప్రసిద్ధ రచయిత ఈతకోట సుబ్బారావు గారి “పోడు గాలి” కథాసంపుటిని ప్రముఖ వక్త లతీఫ్ కుట్టి ఆవిష్కరించారు. కాగా రచయిత, విమర్శకులు అబ్దుల్ రాజా హుస్సేన్ రాసిన ‘స్ఫూర్తి ప్రదాతలు’ ‘పైగంబర కవిత్వం’ పుస్తకాల్ని శ్రీమతి గోవిందరాజు సుభద్రా దేవి, శ్రీ పరవస్తు నాగసాయి సూరి గార్లు విడుదల చేశారు. తదనంతరం ప్రతి యేట మాడభూషి సాహిత్య పరిషత్ Tshirt వారు ప్రదానం చేసే “మాడభూషి ఉత్తమ విమర్శ పురస్కారా”న్ని ఈ యేడాది అబ్దుల్ రాజా హుస్సేన్ గారికి అంతర్జాతీయ కవి పెరుగు రామకృష్ణ గారిచేత ఇవ్వడం జరిగింది. సమాజ సంక్షేమాన్ని కాంక్షించే గొప్ప కథలని ఈతకోట సుబ్బారావు రాశారని లతీఫ్ కుట్టి తెలిపారు. కవిత్వం గొప్పకళని అది సంక్షేమ సమాజానికి దిక్సూచి అని పరవస్తు నాగసాయి సూరి అన్నారు. అబ్దుల్ రాజా హుస్సేన్ గారు మాట్లాడుతూ. … సాహిత్య విమర్శ ఆరోగ్యవంతమైన రచనలకు దారి దీపమని కొనియడారు. తర్వాత సుమారు 15 ఆవృత్తాల్లో శతాధిక కవులు, కళాకారు పాల్గొని క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని గొప్ప కవితలు, పాటలు, పద్యాలను వినిపించారు.

ఇటు ఆంధ్ర అటు తెలంగాణ భారత దేశంలోని ఇతరేతర ప్రాంతాలనుండి కవులు ఉగాది జాతీయ కవి సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరైనారు. ఈ కార్యక్రమంలో నెల్లూరులో ఔత్సాహిక సాహితీ బంధువులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం విద్యాత్మక సిబ్బంది పాల్గొన్నారు.
…………………..