ఘనంగా సర్ పిట్టి త్యాగరాయ శెట్టి జన్మదినోత్సవం

చెన్నై న్యూస్: శ్వేతాంబరయోగి, మద్రాస్ మొదటి మేయర్, సర్ పిట్టి త్యాగరాయ శెట్టి 173 వ జయంతి సందర్భంగా చెన్నై పాత చాకలిపేటలోని సర్ త్యాగరాయ శెట్టి కళాపరిషత్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సర్ త్యాగరాయ కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి జక్కుల హరికృష్ణ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ ఉన్నత పాఠశాల వద్ద నుంచి త్యాగరాయ శెట్టి చిత్రపటంతో ఊరేగింపుగా పార్కులో ఉన్న సర్ త్యాగరాయ శెట్టి విగ్రహం వద్దకు వెళ్లారు.

అక్కడ త్యాగరాయ శెట్టి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం త్యాగరాయ కళాశాల ఆవరణంలో ఉన్న దివంగత సర్ పిట్టి త్యాగరాయ శెట్టి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ త్యాగరాయ శెట్టి చేసిన సేవలను కొనియాడారు. త్యాగరాయ శెట్టి సింగార చెన్నై రూపశిల్పి, ఆ రోజుల్లోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేశారు. అన్ని దానాలు కన్నా విద్యాదానం ఎంతో గొప్పదని తలంచి పలు పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి వాటికోసం ఎంతో కృషి చేశారని చెప్పారు.

ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కాట్నా శ్రీనివాసులు, పరిషత్ ఉపాధ్యక్షులు ఎం.ఆర్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి శ్రీ దేవి మాధవయ్య, సభ్యులు యర్ర ఈశ్వరయ్య, దొడ్డి బాలరాజు, బాలాజీ లవిశెట్టి, గజలక్ష్మి ఉమ్మిశెట్టి, జక్కుల శోభారాణి, లవిశెట్టి లావణ్య బాలాజీ, గొట్టిముక్కల సీతమ్మ, చిన్నారులు బేబీ పూజశ్రీ, బేబీ నేహా లవిశెట్టితో పాటు పలువురు పాల్గొన్నారు.

శ్రీ చెన్నపురి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో దివంగత సర్ పిట్టి త్యాగరాయ శెట్టి జన్మదినోత్సవం సందర్భంగా త్యాగరాయ కళాశాల ఆవరణంలో ఉన్న త్యాగరాయ శెట్టి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

అనంతరం సంఘ ప్రెసిడెంట్ కోనంకి జనార్ధన్ మాట్లాడుతూ…. సర్ త్యాగరాయ శెట్టి మద్రాస్ నగరానికి తొలి మేయర్ గా ఎన్నో సేవలు అందించారని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుర్తింపు పొందాలని చెప్పారు. ఆయన చేసిన సేవలను నేటి తరం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జి.రఘు, బండారు సోమ సుందరం,డి.వి. తార చంద్రన్, బి భరణి, తదితరులు పాల్గొన్నారు.

……………………..