హెల్పింగ్ హ్యాండ్ రాజశేఖర్ అల్లింగం

విల్లివాకం న్యూస్: నాకు తల్లి తర్వాత అత్యంత ప్రియమైనది నా మాతృభాష తెలుగు. తెలుగు మన జాతి తరతరాల వారసత్వ సంపద. తెలుగు భాషను సుసంపన్నం, పరిపుష్టం చేసి దాన్ని ఔన్నత్యాన్ని ఇనుమడింప చేయడానికి తెలుగు వెలుగు సంక్షేమ సంఘం స్థాపించినట్లు అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ తెలిపారు. దీంతో తెలుగు తల్లికి సేవ చేస్తున్నానన్నారు. చెన్నై మహానగరంలో తెలుగు భాషలో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల సహాయాలను అందిస్తున్నాను. వివిధ రకాల కవితలు, వ్యాసరచన, గేయాలు, పద్యాలు, క్రీడలు వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నాను.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపురా నీ జాతి నిండు గౌరవము అంటూ కలమెత్తి రాసిన రాయప్రోలు వాక్యాలను గుర్తు చేసుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల నాయకులు మాతృభాషను మరచిపోతున్నారు. మాతృభాషను ప్రోత్సహిస్తే విద్యార్థులందరూ ఆ భాషలోనే చదువుకునేందుకు ప్రయత్నిస్తారని, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గీతాన్ని ప్రతి పాఠశాలలో వినిపించాలని విజ్ఞప్తి చేశారు.

మాతృభాషను గౌరవించినప్పుడు ప్రతి ఇంట అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు పుట్టి తెలుగు తల్లి సేవకు విప్లవ పంథాలో ముందుకు సాగుతారని గుర్తు చేశారు. పేదవారు నివసించే పెరంబూరు మంగళాపురం, వీనస్ ప్రాంతాలలో జూలై 1వ తేదీ 64వ జన్మదినాన్ని వికలాంగులు, వయోవృద్ధులు, వితంతువులు మధ్య జరుపుకోనున్నట్లు తెలిపారు. వయోవృద్ధులు 100 మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు.

వికలాంగులు, వితంతువులకు వస్త్రదానం చేశారు. సముద్రపు కెరటాల ఆటుపోట్లు లాగా తన కష్టాలను ఓర్చుకొని చివరకు సేవారంగంలో విజేతగా నిలిచానని, ప్రతి ఒక్కరూ దయగల హృదయంతో తమ వంతు ఏదో విధంగా సహాయాలను అందిస్తే ప్రతి పేదలు బాగుపడతారని, జీవితంలో కలతలు తొలగి కరుణరసం మరింత ఉప్పొంగి వారి జీవితాలు బాగుంటాయని తెలిపారు. బాల సాహిత్యవేత్తలు కవులు, సేవారంగములో రాణించిన వారు, ఉపాధ్యాయులకు తెలుగు వెలుగు బిరుదును సుమారు వెయ్యి మందికి పైగా అందించామని అల్లింగం రాజశేఖర్ తెలిపారు.

నన్ను కన్న అమ్మ తులసిభాయి, నన్ను ఎదగడానికి ప్రోత్సహించిన నాన్న గంగాధరం. మరో జన్మ అంటూ ఉంటే వారి కడుపున పుట్టి మరింత సేవ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. జై జన్మభూమి! జై తెలుగు తల్లి!
(తెలుగు వెలుగు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ 64వ జన్మదిన సందర్భంగా వారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు)


………………….