మంచి చేసుంటే పొత్తులెందుకు?
` కుప్పం ప్రజల సహనానికి జోహార్లు
` చంద్రబాబును ఇన్నాళ్లు భరించారు..
` 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు.. ఆయన వల్ల మంచి జరిగిందా?
` మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి చేకూరిందా? ఆలోచించండి
` కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చా..
` ఇక్కడి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాం..
` ముఖ్యమంత్రి జగన్‌
కుప్పం న్యూస్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వల్ల మంచి జరిగిందా?.. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాల’’ని కుప్పం ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసిందని చెప్పుకొచ్చారు. కుప్పంలోని శాంతిపురం సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘2022లో కుప్పంకు వచ్చినప్పుడు కృష్ణా నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా జలాలను సగర్వంగా కుప్పంకు తీసుకువచ్చాం. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయి. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేస్తామని చెప్పిన చేసి చూపించాం.’ అని తెలిపారు. ‘‘చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు. చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా?. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మంచి జరిగిందా. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్‌. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్‌. కుప్పానికి రెవెన్యూ డివిజన్‌ తెచ్చింది మీ జగన్‌. చిత్తూరు పాల డెయిరీని పున:ప్రారంభించింది మీ జగన్‌. కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం. ’’ అని తెలిపారు. కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా? అని ప్రశ్నించారు. ‘‘చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారు. 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కూడా కట్టుకోలేదు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా?. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా? మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి… రంగాను హత్య చేయించింది చంద్రబాబే కదా. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తరఫున భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి. భరత్‌ గెలిచిన తర్వాత మంత్రి చేస్తాం. కుప్పాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం.’’ అని తెలిపారు.
‘‘రెండు లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలని మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసింది. కృష్ణా జలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టాం. అందుకోసం పరిపాలనపరమైన అనుమతులు కూడా ఇచ్చాం. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతాం. ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో కుప్పంకు సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తున్నాం. 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. ఈ 35 ఏళ్ల కాలంలో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయలేకపోయారు. కుప్పంకు ప్రయోజనంలేని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు నిధులు పారే ప్రాజెక్ట్‌గా చేసుకున్నారు. ప్రాజెక్ట్‌ అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారు. చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు. వెల్లూరు మెడికల్‌ కాలేజీని చిత్తూరు జిల్లాకు రాకుండా చేసింది చంద్రబాబు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని అందించాం. కుప్పం ప్రజలంతా మావాళ్లేనని గర్వంగా చెబుతున్నాను. చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడు నన్ను, సీమను తిడుతూ ఉంటాడు. నేను ఏనాడు కుప్పంను, ఇక్కడి ప్రజలను ఒక్క మాట కూడా అనలేదు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం క్యూలైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం. ప్రతీనెలా ఇంటికే వచ్చి వలంటీర్లు పెన్షన్‌ అందిస్తున్నారు. చంద్రబాబు హయంలో అరకొర ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు ప్రతీ విద్యార్థికి వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం. ఏ ఒక్కరూ మిస్‌ అవకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం. ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకు?’ అని ప్రశ్నించారు.