దక్షిణాఫ్రికా పై విజయం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరిన భారత్‌..

న్యూఢిల్లీ న్యూస్ :దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది
దీంతో భారత్‌కు అదృష్టం కలిసివచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో భారత్ ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడింది.

ఇందులో రెండు మ్యాచుల్లో గెలవగా ఓ మ్యాచులో ఓడింది. మరో మ్యాచును డ్రా చేసుకుంది. భారత్ ఖాతాలో 26 పాయింట్లు ఉండగా 54.16 విజయ శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా రెండో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో రెండు టెస్టులు ఆడిన దక్షిణాప్రికా ఓ మ్యాచులో గెలవగా మరో మ్యాచులో ఓడిపోయింది. 12 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. 50.00 విజయశాతంతో రెండో స్థానంలో నిలిచింది.

ఆ తరువాత వరుసగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ దేశాలు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలన్నింటి విజయశాతం 50 శాతం కావడం గమనార్హం. 45.83 విజయశాతంతో పాకిస్తాన్ ఆరో స్థానంలో 16.67 విజయశాతంతో వెస్టిండీస్ ఏడో స్థానంలో, 15 విజయ శాతంతో ఇంగ్లాండ్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక ఈ సైకిల్‌లో గెలుపు బోణీ కొట్టని శ్రీలంక ఆఖరి స్థానంలో నిలిచింది. శ్రీలంక ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది.కాగా.. మార్చి చివరి నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే.