ద్రావిడ భాషల ప్రాచీన హోదాను నిలబెట్టుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది… ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పిలుపు

చెన్నై న్యూస్ :ద్రావిడ భాషలు విశిష్టమైనవి ప్రాచీనమైనవని కాబట్టే భారత ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించిందని, ఆ హోదాను నిలబెట్టుకోవడం కోసం ఆ భాషా ప్రజలు విశేషంగా కృషి చెయ్యాలని ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అన్నారు. తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయంలో జరిగిన ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల 51వ ప్రపంచ సమ్మేళనంలో పాల్గొని ఆచార్య చేకూరి రామారావు ధర్మనిధి ఉపన్యాసం చేస్తూ ద్రావిడ భాషలకు నాలుగు వేల ఏళ్ళ చరిత్ర ఉందని, ప్రపంచంలోని అతి పురాతనమైన భాషా కుటుంబమని అన్నారు. ద్రావిడభాషల విశిష్టత ప్రాచీనత అనే అంశంపై ఆయన ఉపన్యాసం చేశారు. ద్రావిడభాషలైన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు ప్రాచీన హోదా రావడానికి వాటి విశిష్టత , ప్రాచీనతే కారణమన్నారు. ఒకప్పుడు దక్షిణ భారతమంతా ప్రాధాన్యం ఉన్న తెలుగు ఇప్పుడు తెలుగు ప్రాంతంలోకూడా ప్రాముఖ్యం కోల్పోతోందని, ప్రజలు పాలకులు ఈ విషయాన్ని గుర్తించి కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. భాషంటే కేవలం సమాచార వినియోగానికి ఉపయోగపడేది మాత్రమే కాదు, భాష మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన నాగరికత, మన గుర్తింపు, మన గౌరవం. ఇన్నిటిని ఇముడ్చుకుని ప్రవహిస్తున్న భాషను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపన్యాసానికి ముందు తమిళ విశ్వవిద్యాలయం వి.సి. ఆచార్య తిరువళ్లువన్ మాడభూషిని సత్కరించారు.


……………………