జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ధ్యేయం!

విల్లివాకం న్యూస్: జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేద్దామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ- చెన్నై, ఆత్మీయ సమావేశం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి చెన్నై టీ. నగర్ లో గల ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ (ఆస్కా) వేదికగా నిలిచింది. ఇందులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, చిత్తూరు జిల్లా ఇన్చార్జి డాక్టర్ హరిప్రసాద్, తాడేపల్లిగూడెం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము, చలనచిత్ర నిర్మాత ఏఎం రత్నం, స్టేజ్ సెక్రటరీ మురళీకృష్ణ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వేదిక నలంకరించారు. ఇందులో బొలిశెట్టి సత్యనారాయణ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని గద్దించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. న్యాయం, నీతి కోసం నిలబడదామని, ధర్మపోరాటానికి అందరూ సిద్ధం కావాలన్నారు. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్ర రాష్ట్రం నేడు దరిద్రపు గొట్టుగా మారిందని అన్నారు. ఈ దురదృష్టకర పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. శాసనసభలో జనసేన గళం వినిపించేందుకు మన వంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాయపాటి అరుణ మాట్లాడుతూ అన్ని కులాలలో సమానత్వం కోసం ఒక పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం మాట్లాడుతూ దేశభక్తుడు, ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ అని, రైతులకు లక్షలాది రూపాయలు అందజేసి వారికి అండగా నిలిచారని తెలిపారు. 24 సీట్లలో జనసేనను గెలిపించాలని కోరారు. త్వరలో తెరకెక్కనున్న హరిహర వీరమల్లు చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని, దీంతో పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అన్నారు. అనంతరం అతిధులను జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో వ్యాఖ్యాతగా నారాయణ బాబు వ్యవహరించారు.

ఈ సమావేశానికి అనేకమంది జనసేన నిర్వాహకులు, అభిమానులు, కార్యకర్తలు విచ్చేశారు. చెన్నై జనసేన పార్టీ నిర్వాహకులు తంబయ్యనాయుడు, సురేష్ వారి బృందం ఏర్పాట్లు చేశారు.