తెలుగుశాఖలో ఘనంగా ‘క్రోధి ఉగాది వేడుకలు’

విల్లివాకం న్యూస్: మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ‘క్రోధి ఉగాది వేడుకలు’ ఆహ్లాదకరమైన వాతావరణంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉదయం ప్రారంభ సమావేశ కార్యక్రమానికి తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. పాండురంగం కాళియప్ప స్వాగతం పలికారు. అరుణా శ్రీనాథ్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో అధ్యక్షులు శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగను తెలుగు వారి సమక్షంలో తెలుగుశాఖలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికి క్రోధి ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీగేయ రచయిత భువనచంద్ర ఉగాది పర్వదినం తెలుగువారికి ప్రత్యేకమైనదని, అటువంటి రోజుని తెలుగుశాఖలో ఆచార్య విస్తాలి శంకరరావుగారు తెలుగువారి మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతూ, వారిని అభినందించారు. కమలాకర రాజేశ్వరి ఉగాది విశిష్టతను శ్రోతలకు తెలియజేశారు. డా. టి.ఆర్.ఎస్. శర్మ పంచాగ పఠనం గావించారు.
ఈ ప్రారంభ సమావేశం అనంతరం మూడు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ మూడు పుస్తకాలను ముఖ్య అతిథి భువనచంద్ర ఆవిష్కరించారు. అందులో మొదటగా లింగంనేని సుజాత రచించిన ‘మనిషి కథలు’ (కథా సంపుటి)ని తన భర్త ఆచార్య లింగంనేని బసవ శంకరరావుగారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ గ్రంథాన్ని డా. తిరుమల ఆముక్తమాల్యద సమీక్షించారు. రెండవ పుస్తకం గుడిమెట్ల చెన్నయ్య రచించిన ‘ఎక్కడుంది న్యాయం’ (కవితా సంపుటి)ని డా. మామిడి మురళి సమీక్షించారు. మూడవ పుస్తకం డా. విశ్వర్షి వాసిలి వసంత కుమార్ రచించిన ‘జీవన సంహిత’ (కవితాత్మికలు) పుస్తకంపై ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ సమీక్షించారు. ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఈ పుస్తకాలు మూడూ వైవిధ్యమైనవని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షతన తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం ఉగాది పురస్కారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు బూసి వెంకటస్వామికి భువనచంద్ర చేతుల మీదుగా క్రోధి నామ సంవత్సర ఉగాది పురష్కారాన్ని అందించారు.

డా. బూసి వెంకటస్వామి మాట్లాడుతూ మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉగాది పురస్కారన్ని అందుకోవడం ఎంతో అదృష్టం అని తెలుపుతూ, తెలుగుశాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

చివరగా తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. మాదా శంకరబాబు వందన సమర్పణతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఉగాది కవిసమ్మేళన సభకు ఎస్. శశికళ స్వాగతం పలకగా, అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు ఉగాది కవితల ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తమ్మినేని బాబు ఉగాది తెలుగువారికి ఆది పండుగని, అలాంటి పండుగను విశ్వవిద్యాలయంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే భువనచంద్ర కవి సమ్మేళన ప్రారంభ ఉపన్యానం చేసిన అనంతరం టి.ఆర్.ఎస్. శర్మ, కుప్పిలి వెంకటరాజారావుగారు ఇలా 60 మంది ఉగాది కవితలను చదివారు. చివరగా ఏర్పాటు చేసిన ‘ఆనంద లహరి’ (సంగీత కార్యక్రమం) ఎం. ఆర్. సుబ్రహ్మణ్యం సారథ్యంలో అరుణా శ్రీనాథ్, నిడమర్తి వసుంధరాదేవి, వంజరపు శివయ్య, జె. తిరుపతయ్య, ఆచార్య విస్తాలి శంకరరావు ఎంతో చక్కటి సంగీతం ద్వారా శ్రోతలకు వీనుల విందును అందించారు. ఈ సంగీత కార్యక్రమంలో అనేక వైవిద్యమైన పాటలు, చమత్కార సూక్తులతో శ్రోతలను మైమరిపించారు. ఈ కార్యక్రమంతో క్రోధి ఉగాది వేడుకలు పూర్తయ్యాయి.
……………………..