వై.రామకృష్ణ ఆశయాలను కొనసాగనిద్దాం!

విల్లివాకం న్యూస్: తెలుగు భాష, సంస్కృతుల ప్రేమికుడు వై.రామకృష్ణ ఆశయాలను కొనసాగనిద్దామని వక్తలు పిలుపునిచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమం ‘నెలనెలా వెన్నెల -49’ పేరిట ‘ఈ నెల… పగలే వెన్నెల!’ స్వర్గీయ వై రామకృష్ణ 81వ జన్మదిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నై, మైలాపూర్ (లజ్), ఆర్ హెచ్ రోడ్డు లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదికయింది. ఇందులో సభాధ్యక్షులుగా డా. (అజంతా) కె.శంకరరావు వ్యవహరించి స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా సింగపూర్, రిటైర్డ్ రేడియాలజిస్ట్, డా. పళనియప్పన్ విచ్చేశారు. గౌరవ అతిథులుగా శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భావననిర్వాహక కమిటీ కార్యవర్గ సభ్యులు, జనని, ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై, కేయంసిహెచ్ ప్రొఫెసర్, రేడియాలజిస్ట్ డా. దేవి మీనల్ జగన్నాథన్, చెన్నై, మత్తుమందు నిపుణులు, రిటైర్డ్ ప్రొఫెసర్ డా. నెల్లై కుమార్, హైదరాబాదుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత డాక్టర్ రెంటాల జయదేవ, శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ సంయుక్త కార్యదర్శి ఊర శశికళ, విచ్చేశారు.

గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ రామకృష్ణ తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని కొనసాగిస్తూ నిరాడంబరంగా తన జీవితాన్ని ముగించిన సద్గుణశీలి అన్నారు. నెల్లైకుమార్ మాట్లాడుతూ రామకృష్ణ మంచి స్నేహానికి మారుపేరుగా నిలిచారని అన్నారు. డాక్టర్ దేవి మీనాల్ మాట్లాడుతూ తాను ఏ పేషంట్ తోనూ ఇంతటి అనుబంధాన్ని కలిగి ఉండలేదని, చివరి దశలో ఆయన ఆశీస్సులు లభించినట్లు తెలిపారు. డాక్టర్ పలనియప్పన్ మాట్లాడుతూ తనకు 42 ఏళ్లుగా ఆయనతో ఉన్న స్నేహం మరువలేనిదన్నారు. రెంటాల జయదేవ మాట్లాడుతూ ఉదాత్తమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి వై రామకృష్ణ అని, ఆయన ఆశయాలను కొనసాగించేలా ఈ భవనానికి ఉన్న పేరు, ప్రతిష్టలను పునరుద్ధరించాలని, పూర్వ కళను తీసుకురావాలని కోరారు. ఇందుకు అందరి సహకారం అవసరమని అన్నారు. ముందుగా గాయని ఘంటసాల సావిత్రి ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. సభా నిర్వహణను చెన్నై, డిఆర్ బిసిసిసి హిందూ కళాశాల, తెలుగు సహాయాచార్యులు డా. తుమ్మపూడి కల్పన చేపట్టారు. ఇందులో అందమైన జీవితం పేరిట వై రామకృష్ణ కు సంబంధించిన వీడియో, ఫోటో ప్రదర్శన జరిగింది. కుమారి మునిపల్లె హంసిని నృత్య ప్రదర్శన, కేసరి మహోన్నత పాఠశాల, టి.నగర్ విద్యార్థుల మయసభ ప్రదర్శన, జోశ్యుల శైలేష్ పద్య పఠనం, పత్రి అనురాధ పుస్తక విలాపం, ఘంటసాల సావిత్రి భావగీతాలు, ఎస్ పి వసంత లక్ష్మి, డి సరస్వతి హాస్య గుళికలు కార్యక్రమాలు అలరించాయి. ముందుగా రామకృష్ణ చిత్రపటం వద్ద అతిథులు, నిర్వాహకులు నివాళులు అర్పించారు. ఇందులో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.