తెలుగు భాషను బ్రతికించుకుందాం: గుడిమెట్ల చెన్నయ్య పిలుపు

చెన్నై న్యూస్: తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను బతికించుకుందామని జననీ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. చెన్నై మహానగరంలోని పాత చాకలిపేట, నమశ్శివాయ వీధిలో ఉన్న దేవాంగ సంఘం కనికల గుడి ఆవరణములో శ్రీ త్యాగరాయ కళాపరిషత్ మరియు ఉత్తర మద్రాస్ ఉగాది సంబరాల నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శ్రీ క్రోధినామ ఉగాది ఉత్సవాలు 2024 పేరిట ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఎం.ఆర్ సుబ్రహ్మణ్యం ప్రార్థనాగీతంతో సభ ప్రారంభమైనది. సూరతి బలరామన్ స్వాగతం ఉపన్యాసం చేయగా, శ్రీకృష్ణ గీతా సమాజం గీతా పారాయణం చేశారు. 2024 శ్రీ క్రోధి నామ ఉగాది సందర్భంగా మా నెల్లూరుకు చెందిన శ్రీ దేవి మాధవయ్య పంచాంగం పఠనం చేశారు. అనంతరం జరిగిన సభకు శ్రీ త్యాగరాయ కళాపరిషత్ ప్రెసిడెంట్ డాక్టర్ నందివర్మన్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. దేశభాషలందు తెలుగు లెస్స అనే కమ్మనైన తెలుగు భాషను ఉత్తర చెన్నైలోని పాత చాకలి పేటలో నేటి తరం యువతకు తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు, తెలుగు ప్రజలు అభినందనీయులు అన్నారు. పేరిసెట్ల భాస్కరుడు తనును ఈ పాత చాకలిపేటకు పరిచయం చేశారని ఆయన చెప్పారు. తెలుగు భాష సాంప్రదాయాలను నేటితరం వారికి తెలుపుతూ ఉగాది సందర్భంగా శ్రీ త్యాగరాయ కళాపరిషత్, ఉత్తర మద్రాస్ ఉగాది సంబరాల నిర్వాహక కమిటీ వారు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. కనీసం ఇంట్లో అయిన తెలుగులో మాట్లాడుకుని పిల్లలకు తెలుగు భాష పై మక్కువను తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే శ్రీ త్యాగరాయ కళాపరిషత్ ప్రెసిడెంట్ డాక్టర్ నంది వర్మ న్ మాట్లాడుతూ… కళా పరిషత్ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి ఏడాది తెలుగు భాష పై కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలుగు వెలుగు సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు అల్లింగం రాజశేఖర్ మాట్లాడుతూ… తెలుగు ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని, తాను కూడా తెలుగు వెలుగు సంక్షేమ సంఘం ద్వారా తెలుగు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నానని తెలియజేశారు. తెలుగు భాష ను బ్రతికించడం కోసం మనందరం ఐక్యతతో కృషి చేద్దామని చెప్పారు. అలాగే నిర్వాహకులు జక్కుల హరికృష్ణ మాట్లాడుతూ… ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ సంస్థ ద్వారా నిర్వహించిన వేషధారణ, చిత్రలేఖనం, వ్యాసరచన వక్తృత్వ పోటీలు, ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్ నిర్వహించామని గెలుపొందిన విజేతలకు పాల్గొన్న వారికి బహుమతులను పంపిణీ చేసామన్నారు.

శ్రీ చందుస్ నాట్యాలయం కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సబికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రజలు ,మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని జయప్రదం చేశారు. అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త కట్నా శ్రీనివాసులు,ఈ ఏర్పాట్లను జక్కుల హరికృష్ణ, వమ్మిటి శ్రీనివాసులు, దొడ్డి బాలరాజు, దేవి లక్ష్మీకాంత్, జక్కుల కుమార్ బాబు, పర్యవేక్షించారు.