మానవాళికి పరిశోధనలే మహోన్నత మార్గాలు

హైదరాబాద్ న్యూస్ :ప్రపంచం నిత్యం నూతన సత్యాలను ఆవిష్కరించుకోవడం వల్లనే అభివృద్ధి సాధ్యమని, దీనికి మూలమైంది పరిశోధనలనీ, ఆ పరిశోధనలే మానవాళిని మహోన్నత స్థానానికి తీసుకొని వెళుతున్నాయని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారు బుధవారం (20.3.2024) ఏర్పాటు చేసిన ప్రత్యేక అతిథి ఉపన్యాసంలో భాగంగా హెచ్ సియు నుండి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి అంతర్జాలం ద్వారా ప్రసంగించారు. కొత్తగా ఏర్పడిన ఆ విశ్వవిద్యాలయంలో తెలుగు చదువుతున్న విద్యార్థులకు ‘పరిశోధన-మెళకువలు’ అనే పేరుతో పరిశోధన పట్ల అవగాహన కోసం ఈ ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డా.గరికపాటి గురజాడ తెలిపారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన ప్రసంగంలో శాస్త్రీయ విధానమే పరిశోధన అనీ, దాని కోసం ఎంతో అనుభవంతో అందించిన పుస్తకాలు, ప్రసంగాల ద్వారా పరిశోధనల్లోని మెళకువలను గ్రహించాలని అన్నారు. తెలుగులో సాహిత్యం, భాష, జానపద సాహిత్యం, సంస్కృతీ-చరిత్రలనే విభాగాలుగా పరిశోధనలు జరుగుతుంటాయనీ, భాషా సాహిత్యాల పరిశోధనలకు సమాజమే ప్రయోగశాల వంటిదనీ ఆచార్య దార్ల వివరించారు. క్షేత్ర పర్యటనలో సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందేపరిశోధనలు మౌలికమైన అంశాలను అందిస్తాయనీ, అటువంటివాటిని పరిమాణాత్మక పరిశోధన (క్వాంటిటేటివ్ రీసెర్చ్)లని పిలుస్తారన్నారు. సమస్య పరిష్కారానికి, సత్యాన్వేషణకు క్షేత్ర పర్యటన ద్వారా అనుభవ పూర్వకంగా ప్రయత్నించే పద్ధతి దీని ద్వారా జరుగుతుందన్నారు. భాషలో, సంస్కృతిలో వస్తున్న మార్నుల్ని కనుగొనడానికి పరిమాణాత్మక పద్ధతి ఉపయోగపడుతుందని ఆచార్య వెంకటేశ్వరరావు వివరించారు. అప్పటికే ఉన్న వివిధ సిద్ధాంతాలను, చారిత్రక స్థితిగతులను ఆధారంగా చేసుకుంటూనే జీవిత చరిత్రలను, కావ్య పరిణామాలను, వాటి కార్య కారణాల తాత్విక పరిణామాలను గుణాత్మక పరిశోధన (క్వాలిటేటివ్ రీసెర్చ్) పద్ధతి వల్ల తెలుసుకోవచ్చని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సోదాహరణంగా వివరించారు.
ప్రస్తుతం తెలుగు భాషాసాహిత్యల పరిశోధనల్లో పునర్ వైభవాన్ని పొందటానికి
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో యువకులు అధ్యాపకులుగా ప్రవేశించటంతో తెలుగు పరిశోధనలల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయన్నారు. సైన్స్, సామాజిక శాస్త్రాలలో జరిగే పరిశోధనల మాదిరిగానే తెలుగు భాషా సాహిత్య రంగాలలో కూడా శాస్త్రీయంగా జరగాలనే తపనతో శైలీ పత్రాలను అనుసరించడం, పరిశోధన పత్రం/సిద్ధాంత గ్రంథాన్ని రాసే పద్దతులపై ప్రత్యేక శిక్షణను తీసుకోవడం వంటివన్నీ అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ కనిపించడం మంచి పరిణామమని ఆచార్య దార్ల పేర్కొన్నారు. హెచ్ సియు, ఉస్మానియా, యోగి వేమన, ఆంధ్ర, ఢిల్లీ, మద్రాసు, కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో ఈ మధ్య తెలుగు పరిశోధనలపై సదస్సులు, వర్క్ షాపులు, ప్రత్యేక ఉపన్యాసాలు జరుగుతున్నాయని, అది తెలుగు పరిశోధనకు శుభపరిణామమని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పరిశోధక విద్యార్థులు వివిధ అంశాలపై చర్చించి, తమకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు డా.బత్తుల అశోక్ కుమార్ స్వాగతం పలికి, వందన సమర్పణ చేశారు.
………………….