నెహ్రూ నగర్ లో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

 

చెన్నై న్యూస్ : చెన్నై మహా నగరంలోని తండయారుపేట నెహ్రూ నగర్ లో శ్రీరామ ఆలయం నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల 56వ సంవత్సర కల్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా బుధవారం నిర్వహించారు. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన దాదాపు 700 కుటుంబాలకు చెందిన తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. వీరంతా ఐక్యతతో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఆంధ్రాలోని గ్రామీణ ప్రాంతంలో శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుగుతాయో అదేవిధంగా సాంప్రదాయ బద్దంగా జరుపుకున్నారు.

ఆలయాన్ని, వీధులను మామిడి తోరణాలతో, పుష్పాలతో అలంకరించారు. శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమికి సీతారాములను ఎంతో అందముగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఘనంగా కల్యాణం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలుగు ప్రముఖులు లక్ష్మీనారాయణ, పద్మావతి దంపతులు పీటలపై కూర్చుని సీతారామ కళ్యాణం జరిపించారు.తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చి సీతారామ కల్యాణాన్ని చూసి పులకించి పోయారు.

ఆలయానికి వచ్చిన భక్తులకు వడపప్పు పానకం, మజ్జిగ, శీతల పానీయాలు, ప్రసాదం, అన్నదానం చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ నిర్వహణ కమిటీ అధ్యక్షులు ఐ వి బాలాజీ, కార్యదర్శి జి బాబు, కోశాధికారి పి ఏ ప్రకాష్ బాబు, ఉపాధ్యక్షులు డి బాలాజీ, ఏ సురేష్, సహాయ కార్యదర్శులు ఏ ఆర్ నాగరాజన్, ఆర్ బాజీబాబు, సహాయ కోశాధికారులు పి ఉదయ్ కుమార్, ఎస్ శశి కుమార్ లు పర్యవేక్షించారు.

ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదాలతో పాటు బహుమతులను అందజేశారు.