ఘనంగా
‘గవర్నర్ పేట్ టు గవర్నర్ హౌస్’
పుస్తకావిష్కరణ

విల్లివాకం న్యూస్: తమిళనాడు మాజీ గవర్నర్
పి.ఎస్. రామమోహన్ రావు జ్ఞాపకాల సంపుటిగా రచించిన
‘గవర్నర్ పేట్ టు గవర్నర్ హౌస్’ పుస్తకావిష్కరణ శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీనికి చెన్నై, రాజ్ భవన్, భారతీయార్ హాలు వేదికగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ మరియు ఆర్‌బిఐ మాజీ గవర్నర్, డాక్టర్ సి. రంగరాజన్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఎంకె నారాయణన్, అఖిల భారత తెలుగు సమాఖ్య, అధ్యక్షులు, ప్రొఫెసర్ సీఎం కే రెడ్డి తదితరుల సమక్షంలో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి లాంచనంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మొదటి ప్రతిని డాక్టర్ సి రంగరాజన్ అందుకున్నారు. ముందుగా పీఎస్ రామమోహన్ రావు పుస్తక రచనలో తన అనుభవాలను పంచుకున్నారు. 2002 నుంచి రెండేళ్ల పాటు తమిళనాడు గవర్నర్ గా సేవలందించినట్లు తెలిపారు. ఎం కె నారాయణన్, డాక్టర్ సి రంగరాజన్ పుస్తక సమీక్ష చేశారు. ముఖ్య అతిథి ఆర్ ఎన్ రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాలన వ్యవస్థకు ఈ పుస్తకం మార్గదర్శిని వంటిదని అన్నారు. విభిన్న కోణాల జ్ఞాన సంపత్తిగా అభివర్ణించారు. అలాగే దేశ రాజకీయ పరిస్థితులకు సంబంధించిన వివరాలను తెలిపారు. చివరిగా ప్రొఫెసర్ సీఎం కే రెడ్డి వందన సమర్పణ గావించారు. అరుంధతీయుల రిజర్వేషన్ల కోసం పిఎస్ రామమోహనరావు చేసిన కృషి ప్రశంసనీయమని, దీంతో ఆ వర్గాల వారు ఉన్నత పదవులలో కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అతిధులు సత్కారాలను అందుకున్నారు. గవర్నర్ ఆర్ ఎన్ రవి, పిఎస్ రామమోహన్ రావులను ప్రొఫెసర్ సీఎం కే రెడ్డి, డాక్టర్ ఏవి శివకుమారి శాలువలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పలువురు వైస్ ఛాన్స్ లర్లు, ఉన్నతాధికారులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
……………