తెలుగు జర్నలిజం’పై ప్రసంగ కార్యక్రమం

విల్లివాకం న్యూస్: తెలుగు జర్నలిజంపై ప్రసంగ కార్యక్రమం చెన్నై, రాజధాని కళాశాల, తెలుగు శాఖలో గురువారం ఉదయం జరిగింది. ‘తెలుగు జర్నలిజం’ అన్న అంశంపై జర్నలిస్టు సిహెచ్ ముకుందరావు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ జర్నలిజం కొత్త పుంతలు తొక్కుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ మీడియాకు మారుతున్నట్లు తెలిపారు. జర్నలిజం అంటే ఏమిటి? వార్తలు ఎలా రాయాలి? శీర్షిక ఎలా పెట్టాలి? ఇంటర్వ్యు ఎలా చెయ్యాలి?
రాయడంలో మెళకువలు, రాసిన వార్త ఎన్నిగంటలకు పంపాలి? మనం రాసిన వార్త పత్రికలో ఎలా ప్రచురిస్తారు? ఇలా అనేక విషయాలు కూలంకషంగా వివరించారు. అలాగే, ఆయన తన ప్రసంగంలో జీవితంలో ఒంటరిగా చెన్నైకి వచ్చి నేడు తనకాళ్ల పై ఎలా నిలబడ్డారో వివరించారు. జీవితంలో ఏదన్నా సాధించాలన్న తపనతోపాటు నిజాయితీగా ఉండాలని చెబుతూ తన అనుభవాల్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఆయన ప్రసంగం విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు తెలుగు శాఖాధ్యక్షులు డా. ఎలిజబెత్ జయకుమారి తెలిపారు.