లోక్ సభ లో తెలుగులో ప్రమాణం చేసిన తమిళనాడు ఎంపీ గోపీనాథ్....

చెన్నై న్యూస్ :దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీ కృష్ణ దేవరాయులు. సినీ, భావ కవులు కూడా తెలుగు భాష గురించి, ఆ భాష గొప్పతనం గురించి ఎన్నో కావ్యాలు, పాటలు రాశారు.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య కూడా అత్యధికంగా ఉందట. అంత అందమైన భాషను ఇతర రాష్ట్రాలు కూడా చెందిన వారు కూడా ఇష్టపడుతుంటారు. అచ్చమైన తెనుగులో మాట్లాడేందుకు మాత్రం తెలుగు ప్రజలు సంశయిస్తారన్న అపవాదు ఉంది. అలాగే దక్షిణాది భాషల్లో ఒకటైన తమిళాన్ని.. తమిళనాడు ప్రజలు అమితంగా ప్రేమిస్తారని, ఎక్కడ ఉన్నా.. తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కనబడగానే.. తమ లాంగ్వెజ్‌లోనే మాట్లాడతారని అంటుంటారు. ఇతర భాషలకంటే.. తమ భాషకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. హిందీ, ఇంగ్లీషు భాషలను నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపరు.

అలాంటిది తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ.. లోక్ సభలో తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తడంతో పాటు చర్చనీయాంశంగా మారారు. ఆయనే కృష్ణగిరి ఎంపీ కె గోపీనాథ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుఫున పోటీ చేసి గెలుపొందాడు. మంగళవారం ఎంపీలుగా గెలిచిన వారు లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేయగా.. రాహుల్ గాంధీతో పాటు గోపీనాథ్ కూడా ప్రమాణం చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చేత బూని.. ప్రమాణం చేశారు. ఈ క్రమంలో గోపీనాథ్ సైతం.. రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తెలుగులో ప్రమాణం చేశారు ‘సభకు నమస్కారం.కె గోపీనాథ్ అను నేను’ అంటూ స్టార్ట్ చేసి..ప్రమాణం మొత్తం తెలుగులో చేశారు. చివరకు నండ్రి, వణక్కం అని చెబుతూ.. జై తమిళనాడు అని సంబోధించారు.
తన ప్రమాణ స్వీకారం మొత్తం తెలుగులో చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు కె గోపీనాథ్. అయితే ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడానికి ఓ కారణం ఉంది. ఆయన మాతృభాష తెలుగు కాగా, ఆయన పూర్వీకులు తమిళనాడులో స్థిర పడ్డారు. ఆయన హోసూర్‌లో జన్మించాడు. హోసూర్ ప్రాంతం.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. అలా రాష్ట్రం మారినా ఆయన మూలాలు మర్చిపోలేదు. గతంలో మూడు సార్లు హోసూర్ ఎమ్మెల్యేగా గెలిచారు గోపీనాథ్. 2001, 2006, 2011లో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. కానీ 2016లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి. బాలకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. కాగా, ఇప్పుడు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ కృష్ణ గిరి లోక్ సభ స్థానం నుండి బరిలోకి దింపగా.. ఆయన విజయం సాధించారు. ప్పుడు కృష్ణగిరి నుంచి ఎంపీగా గెలిచిన గోపీనాథ్ కూడా హోసూర్‌లో వ్యాపారవేత్త. ఈయన పూర్వీకులు ఏపీ నుంచి హోసూర్ వెళ్లి వ్యాపారాలు చేశారు. అక్కడే స్థిరపడ్డారు.

……………