ఎన్డీయేలోకి టీడీపీ?
` పొత్తుల ప్రకటన లాంఛనమే..

అమరావతి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం- జనసేనతో కలిసి నడిచేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల జాబితా కూడా తయారైందని.. దీనిపై ఈ రోజో, రేపో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. తెలుగుదేశం-జనసేన కలిసి నడవాలని కొద్ది నెలల క్రితమే నిశ్చయించుకున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పి తొలి విడత అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే, తమతో బీజేపీ కూడా కలవాలని ఈ రెండు పార్టీలూ ఆశిస్తున్నాయి. దీనిపై బీజేపీ ఎటూ తేల్చకుండా ఇన్నాళ్లూ నాన్చుడు ధోరణి అవలంబించింది. ఎట్టకేలకు కూటమిలో కలిసేందుకు అంగీకరించినట్లు సమాచారం.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ విబేధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్టీఏ నుంచి బయటకు వచ్చారు. పవన్‌ కల్యాణ్‌తోనూ దూరం పెరగడంతో టీడీపీ అప్పుడు ఒంటరిగా పోటీ చేసింది. ఓట్ల చీలిక వల్ల నష్టపోయామని గుర్తించిన చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌తో కలిసిపోయారు. కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీతో గొడవ మంచిది కాదని గుర్తించి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. గడచిన ఐదేళ్లలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రెండు మూడుసార్లు పార్టీ అధినాయకత్వాన్ని కూడా కలిశారు. కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలుగుదేశం- జనసేన ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. బీజేపీని కూడా కూటమిలో చేర్చేందుకు పవన్‌ కల్యాణ్‌ కూడా తన వంతు ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లుగా ఏ విషయం తేల్చకుండా వస్తున్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకోసమే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలసి దిల్లీ వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎంపీ సీట్లపైనే బీజేపీ నాయకత్వం ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

సీట్లపై స్పష్టతకు వచ్చారా?

ఏపీలో పొత్తులపై బీజేపీ ముఖ్యనేత శివప్రకాశ్‌ ఇక్కడి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అటు టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పైన వేచి చూస్తున్న సమయంలోనే ఇటు అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులు ఎలా ఉన్నా సొంతంగా పోటీ చేసే అవకాశాలపైనా అధ్యయనం చేస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే 2,500 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలోనే పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల పైన పార్టీ నాయకత్వానిదే తుది నిర్ణయమని చెప్పారు. పొత్తుల పై తేల్చే వరకూ తాము అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నామని వెల్లడిరచారు.