ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్; కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించడు – రాహుల్ ద్రవిడ్

త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ చేస్తాడా లేదా అన్న విషయమై భారత జట్టు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ క్లారిటీ ఇచ్చాడు.
ఈ సిరీస్‌లో రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. రాహుల్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని తెలిపాడు. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లండ్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

అందులో భాగంగానే జట్టులో అదనంగా ఇద్దరు వికెట్‌కీపర్లను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాడు. ఇటీవలికాలంలో రాహుల్‌ ఫార్మాట్లకతీతంగా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో మాత్రం ప్రయోగాలు చేయలేమని అన్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ ఐదు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున బ్యాటింగ్‌ పరంగానే రాహుల్‌పై అధిక భారం పడే అవకాశం ఉందని, అందుకే అతనిపై వికెట్‌కీపింగ్‌ భారాన్ని మోపే సాహసం చేయలేమని వివరణ ఇచ్చాడు. వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ స్థానం కోసం కేఎస్‌ భరత్‌, దృవ్‌ జురెల్‌ మధ్య పోటీ నెలకొందని, ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తామని తెలిపాడు. ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో తుది జట్టులోకి ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కావట్లేదని అన్నాడు. కాగా, ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత సెలక్టర్లు రాహుల్‌తో కలిపి ముగ్గురు వికెట్‌కీపర్లను ఎంపిక చేశారు. రాహుల్‌పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే సెలెక్టర్లు కేఎస్‌ భరత్‌, దృవ్‌ జురెల్‌ స్టాండ్‌ బై కీపర్లుగా ఎంపిక చేశారు.