ఇదేం
వ్యూహం!

* వైసీపీలో టిక్కెట్ల గందరగోళం
* ఇంకా వెలువడుతున్న జాబితాలు
*అందులోనూ ఎడాపెడా మార్పులు
* ఇప్పటికే పార్టీని వీడుతున్న సీనియర్లు
*ఎన్నికలకు ఉన్న సమయమే తక్కువ
* ఈ పరిస్థితుల్లో ఇన్‌ఛార్జిలను మార్చడం ఎంతవరకు సమంజసం
* తలలు పట్టుకుంటున్న నేతలు
* గాడి తప్పుతున్న అధినేత నిర్ణయాలు
అమరావతి న్యూస్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకూ తొమ్మిది జాబితాలు విడుదల చేసింది. ఏడు జాబితాలే కసరత్తు అయిపోయిందని అంతా భావించారు. తర్వాత ఎనిమిదో జాబితా విడుదలైంది. ఒకటీ అరా మార్పులు ఉంటాయని.. ఈ టీమే ఎన్నికలకు సమాయత్తం కావాలని జగన్‌ పార్టీ క్యాడర్‌ తో జరిగిన మీటింగ్‌లో చెప్పారు. కానీ, ఇప్పుడు తొమ్మిదో జాబితా కూడా విడుదలైంది. గతంలో ప్రకటించిన వారినే మళ్లీ మళ్లీ మార్పులు చేశారు. దీంతో అయిపోలేదని.. ఇంకా ఉన్నాయన్న సంకేతాలు వినిపిస్తూనే ఉన్నాయి. తుది జాబితాలో ఉండేవారే అభ్యర్థులు. ఇప్పటికీ నియమిస్తున్నది సమన్వయకర్తలేనని వైవీ సుబ్బారెడ్డి గతంలో ప్రకటించారు. దీంతో గందరగోళం మరింత రెట్టింపు అయింది.

అభ్యర్థులా.. సమన్వయకర్తలేనా?

వైసీపీ ఇన్‌చార్జిల తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జిలను జగన్‌ ప్రకటించారు. రెండో జాబితాలో మరో 27 స్థానాలకు (మూడు ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు (ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగులో ఎనిమిది స్థానాలకు (ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ) ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. ఐదో జాబితాలో ఏడు స్థానాలకు (3 అసెంబ్లీ, 4 ఎంపీ).. 6వ జాబితాలో నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు… 7వ జాబితాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. 8వ జాబితాలో 2 పార్లమెంట్‌, 3 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమించారు. తాజాగా విడుదల చేసిన తొమ్మిదో జాబితాలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ సమన్వయ కర్తల్ని ప్రకటించారు. నెల్లూరు ఎంపీ స్థానానికి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డిని ప్రకటించడం గమనార్హం.

అందరిలోనూ గందరగోళం

ఇలా ఎడాపెడా అభ్యర్థులను మార్చడం.. కొత్త జాబితాలను విడుదల చేయడంపై సొంత పార్టీలోనే గందరగోళానికి, అసంతృప్తికి దారి తీస్తోంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతోందని వైసీపీ నాయకులే అంటున్నారు. ఇటీవల కొడాలి నానికి గుడివాడలో టిక్కెట్‌ లేదంటూ జరిగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయనను గన్నవరం పంపుతున్నారని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని లాంటి లీడర్‌ కే ఈ పరిస్థితి ఉంటే.. పార్టీలో మరే నేతకూ టిక్కెట్‌ గ్యారంటీ లేనట్లే. ఈ గందరగోళం సుదీర్ఘంగా సాగుతోంది. జాబితాలు ప్రకటించిన వారికి టిక్కెట్‌ కచ్చితంగా ఉంటుందన్న నమ్మకం లేదు. వారి స్థానాల్లోనూ రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మైలవరం నుంచి తిరుపతిరావు అనే నేతను ఇన్‌చార్జ్‌ గా ప్రకటించారు . తాజాగా టీడీపీ నుంచి చేరిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఇస్తారని అంటున్నారు. మంగళగిరి స్థానాన్నీ మార్పు చేశారు. గతంలో గంజి చిరంజీవిని మంగళగిరికి సమన్వయకర్తగా నియమించగా.. తాజాగా ఆయనను తప్పిస్తూ, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్యకు అవకాశం ఇచ్చారు జగన్‌. పెనుమలూరు ..విజయవాడ ఎంపీ ఇలా అనేక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు టెన్షన్‌ కు గురవుతున్నారు ప్రచారం చేసుకోవాలా.. చివరికి క్షణంలో పేర్లు మార్చేస్తారా అని ఆందోళనకు గురవుతున్నారు. కచ్చితంగా మీరే అభ్యర్థి వైసీపీ హైకమాండ్‌ ఇంత వరకూ ఎవరికీ చెప్పడం లేదు. జాబితాలో చోటు లేని వారు ఇప్పటికైతే సేఫ్‌గా ఉన్నట్లే. ముందు ముందు కసరత్తులో వారి పేర్లు ఉంటాయా ఉండవా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అయితే మార్పు చేర్పుల్లో సీట్లు కోల్పోయిన వారు.. సీట్ల మార్పిడికి గురైన వారిలో అసంతృప్త వాదులు ఇవి సమన్వయకర్తల నియామకం మాత్రమే అని.. అభ్యర్థులు కాదని తేల్చి చెబుతున్నారు. రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చినా బీఫాం మాకే తప్పక వస్తుందని వారు ధీమాగా ఉన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే పాతుకుపోయి ఉంటారు. కొత్త నియోజకవర్గానికి వెళ్లాలంటే చాలా మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి. అక్కడ ఉండే క్యాడర్‌ ను తమ దారిలో నడిపించుకోవాలంటే వారి ఆశల్ని అంచనాల్ని అందుకోవాల్సి ఉంటుంది. అదేమంత చిన్న విషయం కాదు. వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తమ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఏమీ ఒరగలేదన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎంతోకొంత వెనుకేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు.ఇప్పుడు వారిని దారిలోకి తేవాలంటే కొత్త ఇన్‌ఛార్జిలకు ఈ కొద్ది సమయంలో సాధ్యమయ్యే పని కాదు. ఎంపీ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఉంది.
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఊహించని విధంగా ఉన్నారు. వారు ఆయా నియోజకవర్గాల్లో తట్టుకోగలరా అన్న ప్రశ్న కూడా వస్తోంది. అయితే అలాంటి వారు ఇవాళ కాకపోతే రేపైనా హైకమాండ్‌ తెలుసుకుంటుందని ఎన్నికల సమయానికి పరిస్థితిని తెలుసుకుని.. అభ్యర్తుల్లో మార్పు చేర్పులు చేస్తుందని నమ్ముతున్నారు. హైకమాండ్‌ ది కూడా అదే ఆలోచన. ఎన్నికల ముందు వరకూ.. పరిస్థితిని అంచనా వేసిన తర్వాతనే అభ్యర్థులను ఫైనల్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రకటించిన జాబితాల్లోని వారిలో కనీసం 30 శాతం మందికి మార్పు చేర్పులు ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇలా గందరగోళం చేసుకోవడం కూడా వ్యూహమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇదే సందర్భంలో దీన్ని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలు అధికారాన్ని దూరం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, ఇప్పటికే పార్టీలో విభేదాలు పొడచూపుతున్నాయని సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.