యోగా” ప్రతి ఒక్కరి జీవితాల్లో అంతర్భాగం కావాలి…

నెల్లూరు న్యూస్ :శారీరక, మానసిక దృఢత్వానికి యోగా సరైన ఔషదమని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పేర్కొన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, “ఆరోగ్య భారతి” -నెల్లూరు జిల్లా వారు సంయుక్తంగా సరస్వతీ నగర్, వెంటాచలం మండలం కమ్యునిటీ భవనంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆచార్య సంపత్ కుమార్ విశిష్ట అతిధిగా పాల్గొని ‘యోగాను ప్రతి ఒక్కరు తమ తమ జీవితాల్లో అంతర్భాగం చేసుకోవాలని, దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, మనం ఏ పని చేయాలన్నా శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే దేనినైనా సక్రమంగా నిబద్ధతతో చేయగలమని చెబుతూ… ప్రాచీన భారతదేశం నుండి నేటి వరకు యోగా తన ప్రాధాన్యాన్ని గొప్పగా నిలుపుకుంది.

ఆరోగ్యపరంగా యోగా విశిష్టతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఆరోగ్య శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను నొక్కి చెబుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నో ఆలోచనను ప్రతిపాదించారని సంపత్ కుమార్ గుర్తుచేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆరోగ్య భారతి కార్యదర్శి, జైభారత్ ఆసుపత్రి కరస్పాండెంట్ డా. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుపడుతుందని అనతంరం గ్రామం తర్వాత దేశం సన్మార్గంలో వెళుతుందని గుర్తు చేస్తూ.. “యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ” అనే కొటేషన్ జూన్ 21, 2024 పదవ యోగా దినోత్సం థీమ్ మని తెలిపారు. అంటే యోగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా సామాజిక శ్రేయస్సుకు ఎంతో దోహదం చేస్తుందని కాగా సామూహిక ఆరోగ్యం పరస్పర సంబంధాన్ని నొక్కి చెబుతుందని రెడ్డిగారు కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ ప్రాచీన సంస్కృతి ప్రచారకలైన జనార్ధన్ గారు మాట్లాడుతూ… యోగా ఆరోగ్య, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని, ప్రతీ రోజు యోగా చేయడం ద్వారా ఒత్తిడికి దూరమై ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవడానికి అన్నమయ, ప్రాణమయ, మనో, విజ్ఞాన, ఆనందమయ అనే ఐదు యోగా శాస్త్రంలోని పంచకోషాలను అలవర్చుకోవాలని చెప్పారు. ఈకార్యక్రమంలో మల్లెల రామయ్య నర్సింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సిబ్బంది ఇతరేతరులు పాల్గొని యోగాసనాలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో గుర్రం సుధాకర్, డా. షామిలి తదితరులు పాల్గొన్నారు.
………………..